ఆ పాఠశాలలో అసభ్యకర బోధన!
కొత్తవలస:
విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు గురువులు కీచక బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. చదువుల నిలయంలో బాలబాలికలకు అసభ్యకర అంశాలను బోధిస్తున్నారు. చదువుకు సంబంధం లేని ప్రశ్నలతో తప్పుదోవపట్టిస్తున్నారు. చివరకు మహిళా ఉపాధ్యాయురాలిపైనా వేధింపులకు దిగారు. ఆమె నేరుగా డీఈఓకు ఫిర్యాదు చేశారు కూడా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస మండలం వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు 99 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి బోధించేందుకు ఏడుగురు ఉపా ధ్యాయులు ఉన్నారు. వీరిలో కొందరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఏడు, ఎనిమిది తరగతులకు చెందిన బాలికలు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు పిల్లల తల్లిదండ్రులు టీసీలు ఇవ్వాలంటూ పాఠశాలకు వెళ్లినట్టు సమాచారం. ఓ దశలో ఎక్కువగా వేధిస్తున్న కీచక ఉపాధ్యాయుడికి బుద్ధిచెప్పేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆయన ఈ నెల 3 నుంచి సెలవుపెట్టడంతో సాధ్యంకాలేదన్నది సమాచారం. ఆధునిక పద్ధతుల్లో బోధించేందుకు ప్రభుత్వం సమకూర్చిన పరికరాలను వక్రబుద్ధితో అసభ్యకర బోధనకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. కళలోకి యువరాజు వస్తున్నాడా? ఆడ పిల్ల నడుము శంఖంలా ఉండాలి.. కళ్లు.. చేపకళ్లులా ఉండాలి.. ఎంతమంది పుష్పవతి అయ్యారు వంటి ప్రశ్నలు కీచక ఉపాధ్యాయుడి నుంచి తరచూ బాలికలకు ఎదురవుతుండడంతో కొందరు పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మగ పిల్లలకు బూతు బొమ్మలు, చిత్రాలను నేరుగా సెల్‌ఫోన్‌లో చూపడం, ఉపాధ్యాయుడికి చెందిన లవ్‌స్టోరీలు చెప్పడం వంటి వికృత చేష్టలు చేస్తున్నట్టు తెలిసింది.
ఉపాధ్యాయినిపై వేధింపులు..
ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయినికీ ఆ ఉపాధ్యాయుల నుంచి వేధింపులు తప్పలేదు. అసభ్యకర ప్రవర్త, వికృత చేష్టలు, కులంపేరుతో అవమాన పర్చుతున్నారంటూ ఆమె నేరుగా పాఠశాల హెచ్‌ఎం, మరో ఇద్దరు ఉపాధ్యాయులపై అక్టోబర్ 30వ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విచారణ జరిపారే తప్ప చర్యలు తీసుకోలేదన్నది ఆరోపణ. తాజాగా విద్యార్థులకు అసభ్యకర బోధన ఘటనపై విచారణకు డీఈఓ యు.మాణిక్యంనాయుడు వారం రోజుల కిందట డిప్యూటీ డీఈఓ రమణ, మండల విద్యాశాఖ అధికారి–2 బండారు శ్రీనివాసరావును నియమించినట్టు తెలిసింది. వారు పలు సార్లు పాఠశాలను సందర్శించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.
ఉపాధ్యాయురాలిపైనా వేధింపులు
అలస్యంగా వెలుగులోకి వచ్చిన
ఉపాధ్యాయుల కీచక బుద్ధి
పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్న చిన్నారులు
టీసీలు ఇచ్చేయమని పాఠశాలను
ఆశ్రయించిన పలువురు విద్యార్థుల
తల్లిదండ్రులు
డీఈఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment