కొట్టక్కి చెక్ పోస్టు వద్ద పోలీసులు స్వాదీనం చేసుకున్న 810 కిలోల గంజాయి
అడుగడుగునా నిఘా
ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు
గంజాయి రవాణా చేసే మూలాలపై దృష్టి సారిస్తున్న పోలీస్ శాఖ
ఇప్పటి వరకు 2,200 కిలోల గంజాయి స్వాధీనం, 270 మంది అరెస్ట్, 53కి పైగా వాహనాలు సీజ్
ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు: ఎస్పీ వకుల్‌జిందాల్
విజయనగరం టౌన్: విజయనగరం... అటు ఒడిశా సరిహద్దుగా ఉన్న పార్వతీపురం మన్యం.. ఇటు విశాఖపట్నం ఏజెన్సీతో సరిహద్దు ఉన్న జిల్లా. ఈ అవకాశాన్ని గంజాయి వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. మన్యం దారులను గంజాయికి ప్రధాన మార్గంగా వినియోగిస్తున్నారు. వివిధ కూడళ్లతో అనుబంధం ఉన్న విజయనగరం రైల్వేస్టేషన్‌కు, జాతీయ రహదారులకు గంజాయిని చేర్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇటీవల జిల్లాలో కూడా విక్రయాలకు తెరతీశారు.
గంజాయి రవాణాతో పాటు అమ్మకాలను పెంచారు. ప్రధాన కూడళ్ల వద్ద చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో యువతకు విక్రయించి గంజాయికి బానిసలను చేస్తున్నారు. గొడవలు సృష్టిస్తున్నారు. ఈ విషసంస్కృతి పట్టణానికి అనుసరించి ఉన్న పల్లెలు, కళాశాలలకు చేరింది. ఈ వ్యహారం మాఫియాగా మారే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎస్పీ వకుల్‌జిందాల్ ప్రత్యేక శ్రద్ధతో గంజాయి రవాణా, అమ్మకాల నియంత్రణకు పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటుచేశారు. 24 గంటల పాటు నిఘావేసి గంజాయి వ్యాపారానికి చెక్‌పెట్టేలా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేయడంపై దృష్టిసారించారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండడంతో గంజాయితో పట్టుబడుతున్నవారి సంఖ్య పెరిగింది. ఇటీవల కాలంలో రూ.54.66లక్షల విలువైన 2,200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 270 మందిని అరెస్టు చేయడంతోపాటు 53కిపైగా వాహనాలను సీజ్ చేశారు. రూ.14,400 విలువైన 78 గ్రాముల నల్లమందును సైతం సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1972కు కాల్‌చేయాలని సూచిస్తున్నారు. ప్రధానంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సంకల్పం కార్యక్రమం పేరుతో అవగాహన కల్పిస్తున్నారు.
విజయనగరం వన్‌టౌన్, టూటౌన్ పరిధిలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ఇద్దరు యువకులను ఉడాకాలనీలో పోలీ సులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండుకిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ నెల 9న తోటపాలెం శ్మశానవాటిక సమీపంలో బొగ్గులదిబ్బకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
డిసెంబర్ 13న రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక లారీ, రెండు బొలేరో వాహనాల్లో ఒడిశా రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్‌కు గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.40.50 లక్షల విలువ కలిగిన 810 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 కిలోల గంజాయి కొత్తవలసలో స్వాధీనం చేసుకున్నారు.
ఉపేక్షించేది లేదు
నిషేధిత గంజాయి రవాణా చేసేవారెవ్వరైనా ఉపేక్షించేదిలేదు. గంజాయి రవాణాకు పూర్తిస్ధాయిలో అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. గత ఐదు నెలల్లో 200 మందికిపైబడి నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఒకరిపైన పీడీ యాక్ట్ నమోదుచేశాం. అదే పనిగా గంజాయి తరలించేవారిపైనా పీడీయాక్ట్ నమోదు చేస్తాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గంజాయి రవాణా చేసేవారిని ఏరివేయడానికి ప్రత్యేక టీమ్ పనిచేస్తోంది. జిల్లాలో ఐదు చెక్‌పోస్టులు నడుస్తున్నాయి. ప్రతిరోజూ పదిచోట్ల వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ప్రదేశాల్లో వాహన తనిఖీలు చేపడుతున్నాం. సంకల్పం పేరుతో యువత కు అవగాహన కల్పిస్తున్నాం.
– వకుల్ జిందాల్, ఎస్పీ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment