ఆదుకోని సర్కారు
రాజాం: ఆరుగాలం పుడమి తల్లిని నమ్ముకుని సేద్యం చేసే రైతన్నను ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తోంది. ఖరీఫ్ సాయంలో అందజేయాల్సిన పెట్టుబడిసాయం అందజేయలేదు. కనీసం తుఫాన్‌ల సమయంలో పంటను రక్షించుకునేందుకు అవసరమైన టార్పాలిన్లను సైతం పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. రైతన్నను నిలువునా ముంచేసింది. తుఫాన్ వర్షాలకు వందలాది ఎకరాల్లో పంట తడిసిపోతుంటే ఆర్‌ఎస్‌కేకు(ఆర్‌బీకే)కు రెండు చొప్పన జిల్లా మొత్తం 1000 టార్పాలిన్‌లు మాత్రమే అందజేయడంపై రైతులు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల రెండు టార్పాలిన్లను ఎవరికి ఇవ్వాలో తెలియక వ్యవసాయ సిబ్బంది పంపిణీ చేయడమే మానేశారు.
ఇదీ పరిస్థితి...
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.31 లక్షల ఎకరాల్లో 1.90 లక్షల మంది రైతులు వరి పంటను సాగుచేశారు. 50 శాతం మేర రైతులు పంట కోసం నూర్పిడి పనులు పూర్తిచేశారు. కొందరు ధాన్యంను కొనుగోలుకేంద్రాలకు తరలించగా, మరికొంత మంది కళ్లంలో భద్రపరిచారు. పంట చేతికొచ్చే సమ యంలో వరుసగా తుఫాన్‌లు సంభవించడం, వర్షాలు జోరందుకోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది. పంటను రక్షించాలంటూ అధికారులు పదేపదే చెప్పారే తప్ప అవసరమైన టార్పాలిన్లు అందజేయ లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మొత్తంపై రూ.18 లక్షలు వెచ్చించి ఇటీవల 1000 టార్పాలిన్‌లు మాత్రమే కొనుగోలుచేశారు. జిల్లాలో ఉన్న 510 రైతు సేవా కేంద్రాలకు వీటిని సమానంగా రెండేసి చొప్పున పంపిణీ చేశారు. కొన్నింటికి అందజేయలేదు కూడా. వాస్తవంగా ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలో రెండు నుంచి మూడు గ్రామాలు ఉన్నాయి. 30 నుంచి 40 మంది రైతులకు వరి పంట సంరక్షణకు టార్పాలిన్లు అవసరం. వచ్చిన ఒకటిరెండు టార్పాలిన్లను ఎవరికి పంపిణీచేయాలో తోచక వ్యవసాయ శాఖ సిబ్బంది మిన్నకుండిపోయారు. మరోవైపు టార్పాలిన్ కూడా ఒక రోజు తీసుకెళ్లే మరుసటి రోజు తిరిగి ఇచ్చేయాలన్న నిబంధన పెట్టడం రైతులను ఆవేదనకు గురిచేసింది. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీటీ రామారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా జిల్లా వ్యాప్తంగా 1000 టార్పాలిన్‌లు మాత్రమే పంపిణీ చేశామన్నారు. మార్కెట్ యార్డుల వద్ద 63 టార్పాలిన్‌లు ఉంచామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని, పంటలను భద్రపరుచుకునేలా చూడాలని వ్యవసాయశాఖ సిబ్బందికి సూచించామన్నారు.
దిగదుడుపుగా తుఫాన్ ప్రణాళికలు
జిల్లా మొత్తంపై 1000 టార్పాలిన్‌ల మాత్రమే పంపిణీ
ఒక్కో రైతు సేవాకేంద్రానికి రెండేసి చొప్పున అందజేత
గ్రామాల్లో 30 నుంచి 40 మంది వరకూ తుఫాన్ బాధిత రైతులు
టార్పాలిన్‌లు ఎవరికి ఇవ్వాలో తెలియక కొన్నిచోట్ల ఎవరికీ పంచిపెట్టని వైనం
Comments
Please login to add a commentAdd a comment