జమ్ములో డయేరియా
● ఆరు కేసులు నమోదు
గుర్ల: మండలంలోని జమ్ము గ్రామంలో డయేరియా విజృంభించింది. ఒక్కసారిగా ఆరు డయేరియా కేసులు నమోదు కావడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. జమ్ము సత్యనారాయణమ్మ డయేరియాతో విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కొల్లూరి అనురాధ, నడిపిల్లి సన్యాసప్పుడు, వెంపడాపు రామునాయుడు, గొర్లె స్వామినాయుడు చీపురుపల్లిలోని సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. వెంపడాపు శ్రీను తెట్టంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం తీసుకుంటున్నాడు. గ్రామంలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా కేసులు నమోదవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని డయేరియా ప్రబలకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
గురువుల వినూత్న నిరసన
సీతంపేట: సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై గిరిజన గురుకులాల్లో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తంచేశారు. సీతంపేట ఐటీడీఏ ముఖద్వారం వద్ద ఉన్న అడవితల్లి విగ్రహం ముందు బుధవారం జోరువానలో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. 36 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీలో తమ పోస్టులు మినహాయించి సీఆర్‌టీగా మార్పు చేయాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బి.గణేష్, ఎస్.మోహన్‌రావు, కె.భవాని తదితరులు పాల్గొన్నారు.
వరి కుప్పలపై ఏనుగుల దాడి
గరుగుబిల్లి: ఓ వైపు తుఫాన్ వర్షాలు పంటను తడిసిముద్దచేస్తుండగా, మరోవైపు గజరాజులు పంటను నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట మట్టిలో కలిసిపోతోందంటూ ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల నుంచి సంతోషపురం, సుంకి, మరుపెంట గ్రామాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి. మంగళవారం రాత్రి సుంకి గ్రామానికి చెందిన గొల్లు అన్నపూర్ణ, గొల్లు చంద్రమౌళి, గులిపిల్లి కమల తదితర రైతులకు చెందిన పంట పొలంలో వేసిన వరి కుప్పలను చెల్లాచెదురుగా విసిరేశాయి. పైప్‌లైన్‌లను ధ్వంసం చేశాయి. ఏడు ఏనుగుల గుంపు ఎవరిపైన ఎప్పుడు దాడిచేస్తాయోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment