ఇంధన సర్దుబాటు పేరుతో జిల్లా వినియోగదారులపై బిల్లుల మోత
తక్కవ విద్యుత్ వినియోగించినా అధిక మొత్తంలో బిల్లులు
యూనిట్‌కు రూ.1.18 చొప్పున సర్దుబాటు చార్జీల వసూలు
ప్రజావ్యతిరేక పాలనపై పోరుబాటకు పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్‌శాఖ అధికారుల కార్యాలయాల వద్ద నేడు నిరసన
బిల్లుల భారం తగ్గించాలంటూ అధికారులకు వినతులు ఇవ్వనున్న నాయకులు
సాక్షిప్రతినిధి,విజయనగరం/ విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. బిల్లుల భారాన్ని తగ్గిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలిచ్చిన టీడీపీ కూటమి నేతలు... ఇప్పుడు చార్జీలు పెంచి వినియోగదారులకు షాక్ కొట్టిస్తున్నారు. తక్కువ విద్యుత్ వినియోగించినా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇంధన సర్దుబాటు పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లులుపెడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం అమలుచేసిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఎత్తేసి... వారికి గుండెదడ పెంచేలా రూ.వేలల్లో బిల్లుల భారం వేశారు. ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు బిల్లుల భారంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంచిచేస్తుందనుకున్న కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసిందంటూ గగ్గోలుపెడుతున్నారు.
చంద్రబాబు మోసపూరిత హామీలకు మరోసారి మోసపోయామని పలువురు నిట్టూర్చుతున్నారు. ప్రజల ఆవేదనను తీర్చేలా... కూటమి సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, విద్యుత్ బిల్లుల పెంపునకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శుక్రవారం పోరుబాటకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ప్రజలతో కలిసి నిరసన ర్యాలీలు నిర్వహించి, బిల్లులు తగ్గించాలంటూ అధికారులకు వినతులు అందజేయనుంది.
బిల్లుల బాదుడు ఇలా..
జిల్లాలో నెలకు 268 మిలియన్ యూనిట్లు (2.68 కోట్ల యూనిట్లు) వరకు విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఏడాదికి 3,223 మిలియన్ యూనిట్లు వరకు విద్యుత్ వినియోగం అవుతోంది. కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల పేరిట ఇప్పడు యూనిట్‌కు రూ.1.18 వరకు వసూలు చేస్తోంది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై ఏడాదికి రూ. 267 కోట్ల అదనపు భారం పడనుంది. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.38 కోట్లు, వాణిజ్య విద్యుత్ వినియోగదారులు నుంచి రూ. 9 కోట్లు, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నుంచి రూ. 201 కోట్లు, సంస్థలు, సాధారణ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.19 కోట్లను ప్రభుత్వం వసూలు చేయనుంది.
విద్యుత్ వినియోగం ఇలా...
జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల సంఖ్య: 6,47,922
గృహ విద్యుత్ కనెక్షన్లు: 5,72,464
వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు: 61,282
పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు: 2,753
సంస్థలు, సాధారణ విద్యుత్ కనెక్షన్లు: 11,423
నెలకు వినియోగిస్తున్న యూనిట్లు: 268 మిలియన్లు
సర్దుబాటు చార్జీలతో వినియోగదారులపై ఏడాదికి పడే భారం: రూ.267 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment