విజ్ఞానం పంచిన వైజ్ఞానిక ప్రదర్శన
విజయనగరం అర్బన్: జల్లా విద్యాశాఖ అధికారులు స్థానిక సెయింట్ మేరీ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన విద్యావైజ్ఞానిక ప్రదర్శన పోటీలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విజ్ఞానాన్ని పంచాయి. కొత్తకొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు నాందిపలికాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టుల పనితీరు, వాటివల్ల కలిగే ఉపయోగాలను సవివరంగా తెలియజేశారు. విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. పోటీలు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం (వీఐటీఎం), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చైన్స్ మ్యూజియం (ఎన్‌సీఎస్‌ఎం) సహకారంతో సాగాయి. ప్రదర్శనలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు ప్రారంభించారు. మండల స్థాయిలో మూడు కేటగిరీల్లో ఎంపికై న 81 ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, గణితం, ఎర్త్/స్పేస్ సైన్స్, పర్యావరణ శాస్త్రం, ఇంజినీరింగ్, బయోసైన్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అనే 8 అంశాలపై పోటీ ప్రదర్శన జరిగింది. టీచర్ ఎగ్జిబిట్, విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్, గ్రూప్ విభాగాల్లో ప్రదర్శన పోటీలు సాగాయి. పోటీల ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే చదువుతోపాటు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉత్తమ ప్రాజెక్టులు రూపకర్తలకు జ్ఞాపికలు, బహుమతులు, ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌జేడీ బి.విజయభాస్కర్, డిప్యూటీ ఈఓలు కె.వి.రమణ, కె.మోహనరావు, డీసీబోర్డు కార్యదర్శి టి.సన్యాసిరాజు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న ప్రాజెక్టులు ఇవే..
వ్యక్తిగత విభాగం: ఎస్.ధనోజ్ (జెడ్పీహెచ్ స్కూల్, పెదవేమలి), ఆర్.శివ (ఏపీఎంఎస్, పెదమేడపల్లి)
గ్రూప్ విభాగం: బి.దుర్గాప్రసాద్, వి.మణికంఠ (జెడ్పీ హైస్కూల్ తోండ్రంగి), టి.సంజన, పి.సుష్మ (బీఆర్ అంబేడ్కర్ గురుకులం, వియ్యంపేట)
ఉపాధ్యాయ విభాగం: బి.శ్రీనివాసరావు (జెడ్పీహెచ్ స్కూల్, రామతీర్థం), సీహెచ్ ఉమామహేశ్వరరావు (జెడ్జీహెచ్ స్కూల్, గుర్ల)
ముగిసిన జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక పోటీలు
రాష్ట్రస్థాయికి పలు ప్రాజెక్టుల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment