10న రామతీర్థం గిరి ప్రదక్షిణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి పూజలకు ముస్తాబయింది. ఈ నెల 10న మెట్లోత్సవంతో పాటు, స్వామివారి ఉత్తర ద్వారదర్శనం, గిరి ప్రదక్షిణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైనది. భక్తులు కోదండ రామస్వామివారి బోడికొండ చుట్టూ మొత్తం 8 కిలోమీటర్ల మేర రామనామాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేస్తారు. అనంతరం బోడికొండపై ఉన్న కోదండ రాముడిని దర్శించుకుంటారు. ఎంతో మంది రుషులు తపస్సుచేసి స్వామివారి అనుగ్రహం పొంది అదే పర్వతంపై వృక్షాలు, శిలలుగా మారిపోయారని, బోడికొండ చుట్టూ ప్రదక్షిణచేస్తే పుణ్యం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. పాండవులు నడయాడిన నేల కావడంతో గిరి పర్వతం చుట్టూ నడిచేందుకు భక్తజనం ఆసక్తిచూపుతోంది.
ఉత్తర రాజగోపురం నుంచి సీతారామస్వామి దర్శనం
ఈ నెల 10న వేకువజామున 3 గంటలకు స్వామివారికి ఆరాధన, 4 గంటలకు తిరుప్పావై సేవా కాలం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణ నడుమ తెల్లవారు జామున 5 గంటలకు స్వామివారి ఉత్తర ద్వారదర్శన కార్యక్రమాన్ని అర్చకులు జరపనున్నారు. ఉదయం 7.30 గంటల వరకు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం స్వామివారి తిరువీఽధి ఉత్సవాన్ని జరిపించి ఉదయం 8 గంటలకు భజన, కోలాటం, కీర్తన బృందాలతో బోడికొండ మెట్ల వద్దకు వెళ్లి భక్తిశ్రద్ధలతో బోడికొండ మెట్లను శుభ్రపరిచి పసుపు, కుంకుమలతో పూజించి మెట్లోత్సవం, గోపూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం నీలాచాల బోడికొండ చుట్టూ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థాన సిబ్బంది
ఉత్తర ద్వారం నుంచి దర్శనమివ్వనున్న రాములోరు
ముక్కోటి ఏకాదశి పూజలకు సిద్ధమైన రామక్షేత్రం
పదివేల మందికి అన్న ప్రసాదం
ముక్కోటి ఏకాదశి పూజలకు రామతీర్థంలో ఏర్పాట్లు చేశాం. గిరిప్రదక్షిణతో పాటు మెట్లోత్సవాల్లో పాల్గొనే భక్తులకు దారి పొడువునా మంచి నీళ్లను సరఫరా చేస్తాం. భక్తులు గిరి ప్రదక్షిణ చేసే మార్గాన్ని బాగుచేశాం. ఆలయంలో కూడా ముక్కోటి ఏకాదశి పూజలు వైభవంగా జరపనున్నాం. సుమారు పది వేల మందికి అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తాం. క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. – వై.శ్రీనివాసరావు, ఈఓ, రామతీర్థం దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment