ప్రయాణ ఇక్కట్లు
విజయనగరం అర్బన్: ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందంగా మారింది ఉత్తరాంధ్ర జిల్లాల ప్రయాణికుల పరిస్థితి. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన బహిరంగ సభకు టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున జనాన్ని సమీకరించింది. దీనికోసం ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఆర్టీసీ డిపోల నుంచి 1,519 బస్సు లను కేటాయించింది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు బస్సులు కరువయ్యాయి. కాంప్లెక్స్‌లలో గంటలతరబడి నిరీక్షించాల్సి వచ్చింది. విజయనగరం–విశాఖపట్నం మధ్య ప్రతిరోజూ తిరిగే 39 బస్సు సర్వీసుల్లో బుధవారం కేవలం 15 బస్సులే నడిచాయి.
భారీ సంఖ్యలో బస్సుల కేటాయింపు
ప్రధాని పర్యటనకు జనసేకరణ కోసం అనకాపల్లి జిల్లాకు 445, విశాఖ అర్బన్‌కు 261, విశాఖ రూరల్‌కు 200, విజయనగరం జిల్లాకు 249, పార్వతీపురం మన్యం జిల్లాకు 76, శ్రీకాకుళం జిల్లాకు 272, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 16 బస్సులను ఏర్పాటుచేశారు. వ్యవసాయ పనుల సీజన్ కావడంతో సభకు వెళ్లేందుకు నిరాకరించినా పథకాలు నిలిచిపోతాయని బెదిరించి తరలించారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, తాము రాలేం మొర్రో.. అని మొత్తుకుంటున్నా వినిపించుకోలేదు. రాకపోతే పథకాలు కట్ అయిపోతాయి అని బెదిరించి మరీ ప్రజలను తరలించినట్టు సమాచారం. జిల్లా అధికార యంత్రాంగానికి జన సమీకరణ, ప్రయాణ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. పలు ప్రైవేటు పాఠశాలల బస్సులను కూడా తరలించడంతో దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ప్రధాని గతంలో అనేక మార్లు విశాఖపట్నం వచ్చినప్పటికీ.. ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో చర్చసాగింది. జనాన్ని తరలించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తంటాలు పడ్డారు. ఆర్టీసీలోని అధిక బస్సులు ప్రధాని సభకు తరలించేవారి కోసం వెళ్లిపోవడంతో రోజంతా ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. ఇదేం తీరు బాబూ అంటూ పలువురు నిట్టూర్చారు.
ప్రధాని పర్యటనకు భారీ జనసమీకరణలో కూటమి ప్రభుత్వం
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1,519 ఆర్టీసీ బస్సుల కేటాయింపు
ప్రయాణికులకు తప్పని అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment