విజయాల వీరుడు..నాయుడు
● 25ఏళ్ల నుంచి ఎడ్ల పరుగుపోటీల్లో సత్తా
● ఎడ్లకు రోజువారీ మేత ఖర్చు రూ.రెండువేలు
● ప్రతిరోజూ చెరువులో ఈత కొట్టించడం, పరుగు తీయించడం
వేపాడ: సంక్రాంతి పండగ వచ్చిందంటే..గ్రామాల్లో ఎడ్ల పరుగు ప్రదర్శనకు తెరలేస్తుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఎడ్లు పరుగు తీస్తూ ఉంటే జనాల్లో ఒకటే కేరింత. ఆనందంతో తీర్థ మహోత్సవాలు నిర్వహిస్తారు. వేపాడ మండలం, వల్లంపూడి గ్రామానికి చెందిన శానాపతి అప్పలస్వామి ఉరఫ్ నాయుడు వ్యవసాయం చేస్తూనే పందెం ఎడ్లు పెంచడంలో మమేకమై గత 25 ఏళ్లుగా విజయాలు అందుకుంటున్నాడు. నాయుడు మరో అడుగు ముందేకేసి ఈ ఏడాది మరో ఎద్దును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతని దగ్గర ఉన్న మూడు ఎడ్లు సుమారు రూ.5లక్షల విలువ ఉంటాయి. వాటికి రోజుకు మేతకు రెండువేల రూపాయలు ఖర్చు చేస్తాడు. ఉలవలు, నువ్వుల ఉండలు లాంటి పలు పోషకాహారం కలిగిన పదార్థాలను మేతగా పెడుతు ఉంటాడు. ఉదయాన్నే రహదారిలో పరుగు తీయించడం, చెరువుల్లో ఈత కొట్టించడం వంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఎడ్లను మేపుతున్నాడు. గత 25 ఏళ్లుగా పోటీల్లో పాల్గొంటూ ఇప్పటివరకు నగదు, షీల్ట్, రజతం, బంగారం లాంటి పతకాలు సుమారు 450కి పైగా అందుకున్నాడు.
నాయుడు సాధించిన విజయాల్లో కొన్ని..
ఉమ్మడి విశాఖ జిల్లా చుక్కపల్లిలో 2020 డిసెంబర్ 12న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి బూడి ముత్యాలు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రూ.పదివేలు, షీల్డ్‌ను అందుకున్నాడు.
● 2021 జనవరి16న కేఆర్‌పేటలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం
● సాధించి రూ.పన్నెండువేల నగదు అందుకున్నాడు.
● 2021 జనవరి 25 చుక్కపల్లిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి షీల్డ్, నగదు సాధించాడు.
● 2000లో ఎడ్ల పరుగు ప్రస్థానం ప్రారంభించిన ఏడాదే 15 బహుమతులు సాధించాడు. నాటినుంచి నాయుడు ఎడ్ల పరుగు ప్రదర్శనలో తిరుగులేకుండా ప్రతి ఏటా పోటీల్లో పాల్గొనడం ఏదో ఒక బహుమతి సాధించడంతో నేటికి సుమారు 450పైగా బహుతులు నగదు సాధించారు.
ఎడ్ల పరుగు అంటే ఇష్టం
చిన్నతనం నుంచి ఎడ్ల పరుగు అంటే ఇష్టం. దీంతో వ్యవసాయం చేస్తూ ఎడ్ల పెంపకంపై శ్రద్ధ చూపుతున్నాను. ప్రతి ఏటా విజయాలు అందుకోవడంతో మరింత ఆనందం పట్టుదలతో ఎడ్లను పెంచి పోషిస్తూ గ్రామాల్లో నాయుడి ఎడ్లు అనిపించుకున్నాను. రూ.ఐదు లక్షలతో ఎడ్లు కొనుగోలు చేసి ప్రతిరోజు రెండువేల రూపాయలు మేతకు ఖర్చుచేస్తూ ఉంటాను. ఎడ్లు ఆలనాపాలన నాతోపాటు నాకుమారుడు అప్పలరాజు, బావ ఏడువాక సత్తిబాబు సహకారంతో ఎడ్ల పోషణ సులభంగా చేస్తున్నాను. ఈ ఏడాది ఎడ్ల పరుగు ప్రదర్శనకు సిద్ధమయ్యాను.
శానాపతి అప్పలస్వామి(ఎడ్లునాయుడు)వల్లంపూడి, వేపాడ మండలం
Comments
Please login to add a commentAdd a comment