బస్సులు కేటాయించాలని వినతి | Sakshi
Sakshi News home page

బస్సులు కేటాయించాలని వినతి

Published Wed, Apr 17 2024 1:30 AM

- - Sakshi

వనపర్తిటౌన్‌: నిజాం కాలంలో ఏర్పాటైన వనపర్తి ఆర్టీసీ డిపోలో రవాణా సేవలు విస్తృతం చేసేందుకు చొరవ చూపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి లేఖ అందించారు. డిపోకు 26 బస్సులు కేటాయించాలని, ప్రజలకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేసేందుకు బస్సుల కేటాయింపు అనివార్యమని తెలిపారు. అదేవిధంగా పాత బస్టాండ్‌ కమర్షియల్‌ ప్రాంతంలో ఉందని.. వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. పాత బస్టాండ్‌ను అభివృద్ధి చేస్తే ఆదాయం సమకూరడమేగాక ప్రజలకు వ్యాపార సముదాయం మరింత చేరువ అవుతుందని వివరించారు.

రూ.80 వేల ఔషధాలు సీజ్‌

వనపర్తిటౌన్‌: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే మెడికల్‌ దుకాణాలు, ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు రష్మి, రబీయా హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల మెడికల్‌ దుకాణాలపై దాడులు నిర్వహించారు. శ్రీసాయి మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న రూ.80 వేల మందులు సీజ్‌ చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు.

బస్టాండ్లలో

వసతుల కల్పనపై దృష్టి

అమరచింత: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో నెలకొన్న సమస్యలు తెలుసుకుని మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్‌ వి.వేణుగోపాల్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ను ఆయన పరిశీలించి వసతులపై ఆరా తీశారు. కూర్చోడానికి బేంచీలు, మహిళలకు మరుగుదొడ్లు, ప్రహరీ లేదనే ప్రయాణికులు వివరించారు. జిల్లాకేంద్రం నుంచి ఆత్మకూర్‌ వరకు నడుస్తున్న షటిల్‌ బస్సులను అమరచింత వరకు కొనసాగించాలని స్థానిక నాయకులు కోరారు. అనంతరం డీఎం మాట్లాడుతూ.. డిపో పరిధిలోని అన్ని బస్టాండ్లను సందర్శిస్తున్నామని, కనీస సౌకర్యాల కల్పనకు కావాల్సిన నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించనున్నట్లు వివరించారు. ప్రహరీ నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయని, బస్టాండ్‌ ప్రాంగణంలో ఉన్న డబ్బాల తొలగింపునకు సహకరించాలన్నారు. శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట డిప్యూటీ ఆర్‌ఎంఓ లక్ష్మి ధర్మ, డిప్యూటీ ఈఈ పోచయ్య, మార్కెట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నాగభూషణంగౌడ్‌ తదితరులు ఉన్నారు.

కష్టపడే వారికి గుర్తింపు

పెబ్బేరు రూరల్‌: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరులో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కృష్ణానదిలో ఉన్న నీటిని రైతులకు ఎలా అందించాలో తమకు తెలుసని.. ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పార్టీ పెబ్బేరు మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 23న మల్లు రవి నామినేషన్‌ వేస్తున్నారని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. బిజినేపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌ వరకు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి నామినేషన్‌ వేయనున్నట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకొని గ్రామ కమిటీలు వేశారు. అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, అక్కి శ్రీనివాసులుగౌడ్‌, వెంకటేష్‌సాగర్‌, సురేందర్‌గౌడ్‌, బీరం రాజశేఖర్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, కౌన్సిలర్‌ అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement