వైద్యసేవలను వినియోగించుకోవాలి
మదనాపురం: రోగులు ప్రభుత్వం అందించే వైద్యసేవలను వినియోగించుకోవాలని డీఎంహెచ్‌ఓ డా. అల్లె శ్రీనివాసులు సూచించారు. గురువారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీలో ప్రసవించిన మహిళలను పరీక్షించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం దుప్పల్లిలో కొనసాగుతున్న మధుమేహ పరీక్షలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే కన్ఫర్మేషన్ టెస్ట్‌లు నిర్వహించి డయాబెటిక్ రోగులుగా గుర్తించి సరైన మందులు అందించాలని సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి డా. భవాని, డా. రతన్‌కుమార్, వైద్యసిబ్బంది ఉన్నారు.
ప్రజాక్షేత్రంలో
ఎండగడతాం : బీజేపీ
వనపర్తిటౌన్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్‌రెడ్డి తెలంగాణలో ఉండటానికి వీలు లేదనడం అనైతికమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం బీజేపీ పోరాడుతున్నప్పుడు రేవంత్‌రెడ్డి సమైఖ్యాంద్ర వాదని ఆరోపించారు. నియోజకవర్గంలో బీజేపీకి ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రధాని మోదీ ఆశయాలతో సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో టాప్ టెన్‌లో నిలిచినట్లు వెల్లడించారు. గతంలో 11 వేల సభ్యత్వాలు ఉంటే.. ప్రస్తుతం 31,500 చేయించామన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని.. ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 300 మంది క్రియాశీలక సభ్యులున్నారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపేందుకు సిద్ధంగా ఉన్నారని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ లీగల్‌సెల్ రాష్ట్ర కన్వీనర్ మున్నూర్ రవీందర్, అసెంబ్లీ సమన్వయకర్త పెద్దిరాజు, నాయకుడు రామన్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment