గిరి వికాసం.. దారెటు?
జిల్లాలో అసంపూర్తిగా పనులు
●
బోరుమోటారు ఇవ్వలేదు..
గిరివికాసం పథకం కింద మా భూమిలో బోరుబావి తవ్వి మోటారు బిగించి ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తామన్నారు. ఇప్పటి వరకు బోరుబావి తవ్వి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారే తప్పా మోటారు బిగించలేదు. దీంతో పొలం బీడుగా మారింది.
– బద్యానాయక్, తూక్యానాయక్‌తండా
నీరు అందడం లేదు..
గిరివికాసం కింద బోరుబావి తవ్వించిన అధికారులు నాలుగేళ్లు అవుతున్నా బోరుమోటారు బిగించలేదు. ఎందుకని ప్రశ్నిస్తే నిధులు రాలేదు.. వచ్చినప్పుడు ఇస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బోరుబావిలో నీరున్నా.. వాటిని తోడుకుని పంట పండించుకునే వీలు లేకుండా పోయింది. అధికారులు మా బాధను అర్థం చేసుకొని మోటారు ఇప్పించాలి.
– రెడ్యానాయక్, తూక్యానాయక్ తండా
ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చారు..
ఐదెకరాల పొలంలో ఇక పంటలు పండుతాయని అనుకున్నా. సారోళ్లు చెప్పినట్లు దరఖాస్తు చేసున్నా. బోరుబావి తవ్వించి ట్రాన్స్‌ఫార్మర్ బిగించారు. కాని ఏళ్లు గడుస్తున్నా మోటారు ఇవ్వడం లేదు. ఇంతవరకు ఏమైందో చెప్పడం లేదు.
– గోవిందమ్మ, తూక్యానాయక్‌తండా
అమరచింత: గిరిజన లంబాడీలు తమ వ్యవసాయ పొలాల్లో పంటలు సమృద్ధిగా పండించుకోవాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గిరి వికాసం పథకాన్ని ప్రవేశపెట్టారు. గిరిజన ప్రాంతాల్లో సాగునీరు అందక పంటలు పండించుకునే వీలులేని గిరిజన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.5 లక్షలతో బోరు తవ్వించడం, మోటారు బిగించడం, ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు విద్యుత్ సరఫరాను అందించడం వంటి పనులు చేపట్టి ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. 2020–21లో జిల్లాలో తండాలున్న 12 మండలాల్లో ఐదెకరాల పొలం ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వారి పొలాల్లో సాగునీటి కోసం బోరుబావి తవ్వించి సాగుకు యోగ్యంగా తయారుచేసే బాధ్యతను డీఆర్డీఓకు అప్పగించారు. జిల్లాలో 912 మంది రైతులు గిరివికాసం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 67 మంది మాత్రమే పూర్తిస్థాయిలో లబ్ధి పొందారు. మిగిలిన రైతులు అసంపూర్తి పనులతో తమ పొలాల్లో ఎలా పంటలు పండించుకోవాలో అర్థంగాక అధికారుల రాకకోసం ఎదురు చూస్తున్నారు.
పథకం లక్ష్యం..
పొలాలున్నా సాగునీరు అందక బీళ్లుగా మారి ఉపాధి లేని గిరిజనులు సారా తయారీ, విక్రయాలపై దృష్టి సారిస్తున్నారని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరివికాసం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి వారిని ఆదుకోవాలని నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములకు కలిపి ఐదెకరాల పొలం ఉన్నా సరేదరఖాస్తు చేసుకోవచ్చని సూచించడంతో సాగునీటి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇప్పటి వరకు పూర్తయిన పనులు..
జిల్లాలో ఈ పథకాన్ని 912 మంది గిరిజన రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 520 మంది రైతుల పొలాల్లో బోరుబావులు తవ్వించగా.. 189 మంది రైతుల పొలాల్లో విద్యుత్ పనులు పూర్తి చేశారు. అలాగే 67 మంది రైతుల పొలాల్లో బోరుమోటార్లు బిగించారు.
దరఖాస్తుదారులు 912 మంది..
కేవలం 67 మందికే పూర్తిస్థాయి ప్రయోజనం
బోరుమోటార్ల కోసం గిరిజన రైతుల ఎదురుచూపులు
Comments
Please login to add a commentAdd a comment