రహదారి నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రహదారి నిబంధనలు పాటించాలి

Published Thu, Jan 9 2025 12:55 AM | Last Updated on Thu, Jan 9 2025 12:55 AM

రహదారి నిబంధనలు పాటించాలి

రహదారి నిబంధనలు పాటించాలి

వనపర్తి: వాహన చోదకులు రహదారి నిబంధనలు విధిగా పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు సైతం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి నల్ల చెరువు వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్‌, అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రత వారోత్సవాలను మాసోత్సవాలకు పొడిగించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితుల్లో 60 నుంచి 70 శాతం యువతే ఉంటున్నారని చెప్పారు. బాధిత కుటుంబానికి కలిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. జిల్లాను యాక్సిడెంట్స్‌ ఫ్రీగా మార్చడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్లకు సైతం కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు. పది, ఇంటర్‌ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. రాష్‌ డ్రైవింగ్‌తో జీవితాలను నాశనం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్‌ మాట్లాడుతూ.. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా చక్కగా రోడ్డు భద్రత పాటిస్తూ బాధ్యతగా మెలగాలన్నారు. ఇటీవలి కాలంలో ట్రాఫిక్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని.. ఇప్పటి వరకు 50 మంది జైలుకు వెళ్లారని చెప్పారు. ఏడాది కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా 1.70 లక్షల మంది మరణించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా నల్లచెరువు కట్టపై తెలంగాణ సాంస్కృతిక సారథి, పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి సాయం చేస్తున్న శ్రీనివాస్‌ను సన్మానించి హెల్మెట్‌ను బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి మానస, జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, యువజన సర్వీసులశాఖ అధికారి సుధీర్‌రెడ్డి, డీఐఈఓ అంజయ్య, ఇతర అధికారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాద బాధితుల్లో యువతే అధికం

జిల్లాకేంద్రంలో భారీ బైక్‌ర్యాలీ.. ప్రారంభించిన కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement