తీరనున్న ప్రయాణ కష్టాలు
మదనాపురం: మండల కేంద్రం సమీపంలోని ఊకచెట్టు వాగుకు ఏటా వర్షాకాలంలో శంకరసముద్రం, సరళాసాగర్ జలాశయం నుంచి వరద పోటెత్తడంతో రోజుల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆత్మకూర్, అమరచింత, మదనాపురం, కొత్తకోట మండలాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టగా నాటి నుంచి నేటి వరకు పనులు ఆగుతూ సాగుతూ చివరకు తుది దశకు చేరుకున్నాయి. వంతెన వినియోగంలోకి వస్తే ఆయా ప్రాంతాల ప్రజల రాకపోకల కష్టాలు తీరినట్లే.
రూ.9.25 కోట్లతో..
2017, జనవరి 25న అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు వాగుపై వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో నాటినుంచి తూతూమంత్రంగా పనులు కొనసాగాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి చొరవతో 6 నెలలుగా పనుల్లో వేగం పెంచడంతో తుది దిశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.
ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మాణం
సంతోషంగా ఉంది..
మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ఆనందంగా ఉంది. ఏటా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు పడేవాళ్లం. ఈ ఏడాది ఆ ఇబ్బందులు ఉండకపోవచ్చు. వర్షాకాలంలో వాగు ప్రవహించినా రాకపోకలు సజావుగా సాగుతాయి. పనుల పూర్తికి కృషిచేసిన ఎమ్మెల్యే జీఎంఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– రవికుమార్, కొన్నూరు
90 శాతం పనులు పూర్తి..
వంతెన పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. మట్టినింపే పనులకు ప్రతిపాదనలు పంపించాం. మంజూరు ఉత్తర్వులు త్వరలోనే రానున్నాయి. రెండునెలల్లో వినియోగంలోకి తెస్తాం.
– రాకేశ్, ఏఈ, ఆర్‌అండ్‌బీ, మదనాపురం
ఊకచెట్టు వాగుపై తుది దశకు వంతెన నిర్మాణం
రూ.9.25 కోట్ల వ్యయం..
2017లో పనులు ప్రారంభం
రెండు నెలల్లో వినియోగంలోకి..
Comments
Please login to add a commentAdd a comment