దివ్యాంగుల అభ్యున్నతికి చట్టాలు
వనపర్తి టౌన్: మానసికంగా, శారీరకంగా వైకల్యం పొందిన వారి అభ్యున్నతికి అనేక చట్టాలు ఉన్నాయని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో కొనసాగుతున్న పారా లీగల్ వలంటీర్ల శిక్షణకు రెండోరోజు బుధవారం ఆమె హాజరై మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల సాధనకు ఉన్న చట్టాలు, పథకాలను ఎలా వినియోగించుకోవాలో తెలియజేసేందుకు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సకలాంగులతో సమానంగా రాణించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, రిసోర్స్ పర్సన్ గిరిజప్రీతి, జేజేబీ సభ్యురాలు లక్ష్మమ్మ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి వెంకటరమణ, న్యాయవాదులు పుష్పలత, శంకర్ టి.మల్లీశ్వరాచారి, వి.కళ్యాణి, పి.తిరుపతయ్య కె.మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
ఆస్తిపన్ను వసూలు
లక్ష్యం చేరుకోవాలి
ఆత్మకూర్: ఆస్తిపన్ను వసూలు వందశాతం పూర్తి చేయాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో రూ.13.70 లక్షల ఇంటిపన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.4.98 లక్షలు మాత్రమే వసూలయ్యాయని.. నెలాఖరు వరకు 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 35 శాతం మాత్రమే పన్ను వసూలు చేసినట్లు వివరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిత్యం గ్రామస్తులకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే 94 శాతం పూర్తయిందన్నారు. ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి పాల్గొన్నారు.
హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
వనపర్తి: హత్యానేరం రుజువైనందున నేరస్తునికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత జీవిత ఖైదుతో పాటు రూ.7 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఆత్మకూరు పోలీస్టేషన్ పరిధిలోని బాలకిష్టపూర్‌తండాకు చెందిన మూడావత్ మణెమ్మను భర్త గోపాల్‌నాయక్ పెట్రోల్‌పోసి తగులబెట్టి చంపాడు. ఆమె కొడుకు కృష్ణ నవంబర్ 5, 2020న ఫిర్యాదు చేయగా అప్పటి ఆత్మకూరు ఎస్సై ముత్తయ్య కేసు నమోదు చేయగా సీఐ సీతయ్య విచారణ చేపట్టారు. మృతురాలి మరణ వాంగ్మూలంపై విచారణ జరిపిన సీఐ నిందితుడు గోపాల్‌నాయక్‌పై కేసు ఫైల్ చేశారు. ప్రస్తుత సీఐ, శివకుమార్, ఎస్‌ఐ నరేందర్ ఆదేశాల మేరకు కోర్టు లైజనింగ్ అధికారి హెడ్ కానిస్టేబుల్ సత్యం, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు రాజేందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించగా నేరస్తుడిపై నేరం నిరూపించబడగా న్యాయమూర్తి శిక్షను ఖరారు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
11న కురుమూర్తి
క్షేత్రంలో గిరి ప్రదక్షిణ
స్టేషన్ మహబూబ్‌నగర్: అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 11న ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పరిషత్ జిల్లా అధ్యక్షులు మద్ది యాదిరెడ్డి తెలిపారు. పాలమూరులోని గణేష్ భవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ తేదీన కురుమూర్తి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఉంటుందన్నారు. హిందు బంధువులు, ధార్మిక సంస్థలు, స్వామిజీలు, మహిళా మండలి సభ్యులు, భజన మండలి, యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటలకు దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని, భక్తులు 9 గంటల వరకు చేరుకోవాలన్నారు. అదేవిధంగా 11న జిల్లాలోని అన్ని దేవాలయాల్లో పూజలు, అభి షేకాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు, భజనలు, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వీహెచ్‌పీ విభాగ్ కార్యదర్శి అద్దని నరేంద్ర, జిల్లా కార్యదర్శి నలిగేశి లక్ష్మీనారాయణ, జనార్దన్, హన్మంతు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment