వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు
కొత్తకోట రూరల్: వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఆసక్తిగల వారికి నాబార్డ్, బ్యాంకింగ్ వ్యవస్థలు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రి తెలిపారు. బుధవారం పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో కళాశాల, నాబార్డ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అగ్రి క్లినిక్, అగ్రి బిజినెస్ సెంటర్ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని.. అందులో రైతుల పాత్ర అత్యంత కీలకమన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వ్యాపార ధోరణిని పెంపొందించేందుకు నాబార్డ్ కృషి చేస్తోందని.. ఉద్యాన, వ్యవసాయ రంగాల్లో ఆసక్తి ఉన్నవారు నిపుణుల సహకారంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అగ్రి క్లినిక్, అగ్రి బిజినెస్ సెంటర్ పథకం కింద ఇంటర్ నుంచి పీజీ వరకు చదివిన వారికి 45 రోజుల శిక్షణనిచ్చి ఒక వ్యక్తికి రూ.20 లక్షల వరకు, ఐదుగురు ఉన్న గ్రూపునకు రూ.కోటి వరకు రుణం ఇవ్వనున్నట్టు తెలిపారు. జనరల్ కేటగిరీకి 30 శాతం, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 44 శాతం రాయితీ ఉన్నట్లు వివరించారు. కోవిడ్ తర్వాత ఉద్యానరంగంలో హైడ్రోఫోనిక్, ఆర్గానిక్ ఫార్మింగ్, తేనె తయారీ, పుట్టగొడుగులు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కల పెంపకంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉద్యాన కళాశాల ప్రిన్సిపాల్ డా. పిడిగం సైదయ్య చెప్పారు. అర్హత, వ్యాపార అవకాశాలున్న వారు తమ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా లీడ్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే వివరించారు. నాబార్డు అమలు చేస్తున్న పథకాల గురించి మహబూబ్‌నగర్ క్లస్టర్ డీడీఎంలు షణ్ముఖాచారి, పి.మనోహర్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి గోవింద్‌నాయక్, అన్ని జిల్లాల్లోని అన్ని బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, డిస్ట్రిక్ట్ లీడ్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు, అంకుర పరిశ్రమల అధికారులు, అగ్రికల్చర్ కాలేజ్, ఫిషరీస్ కళాశాల ప్రిన్సిపాళ్లు, ఎఫ్‌ఈఓలు, ప్రొఫెసర్లు. విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment