నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో మూడోసారి బహుళ త్రయోదశి (ధన త్రయోదశి)ని పురస్కరించుకుని మంగళవారం ప్రదోష కాలంలో నందీశ్వరుడికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఉదయం గర్భాలయంలో రుద్వేశ్వరుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలంలో మల్లికార్జున స్వామి గర్భాలయానికి ఎదురుగా ప్రతిష్టితమైన నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకించారు. నందీశ్వరుడికి వస్త్రధారణ చేసి, ధూపం వేసి గంధం బొట్టుపెట్టి అలంకరించారు. వేదోక్తంగా పూజించి పండ్లు ఫలాలతో నైవేద్యం సమర్పించారు. శనిగల ప్రసాదం నందీశ్వరుడి మూతికి కట్టి, వడమాలను మెడలో వేసి సమర్పించారు. అనంతరం ఏక కాలంలో నందీశ్వరుడికి, గర్భాలయంలో రుద్రుడికి నక్షత్ర హారతి సమర్పణ కార్యక్రమం కనులపండువగా జరిపించారు. అర్జిత సేవా టికెట్ భక్తులకు తీర్థప్రసాదాలు, స్వామి వారి శేష వస్త్రాలు అందజేశారు. ఈకార్యక్రమాన్ని వీక్షించి, పాల్గొన్న భక్తులకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలిగి సకల గ్రహాలు ఉపశాంతిని పొంది వివాహం, సంతానం, ఆరోగ్యం తదితర సమస్యలు పరిష్కరించబడుతాయని పురాణాల్లో తెలుపబడినట్లుగా పండితులు పేర్కొన్నారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తమ దోషాలు తొలగించుకోవాలని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు కోరారు. ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమ శర్మ, అర్చకులు నందనం భాను ప్రసాద్, దేవేందర్, సాయిరామ్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment