జిల్లాలో సమర్థంగా పశుగణన
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలో పశు వైద్య, పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘21వ అఖిల భారత పశు గణన’ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు చేపట్టిన పశు గణన కార్యక్రమ పోస్టర్‌ను కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 138 రెవెన్యూ గ్రామాలతో పాటు పట్టణంలోని 57 వార్డుల్లో 68 మంది ఎన్యుమరేటర్లతో పశుగణన జరుపుతున్నట్లు తెలిపారు. ఎన్యుమనేటర్ల పని తీరును మండల స్థాయిలో సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్లు వెళ్లి పశువులు, జంతువులు, రైతుల పూర్తి వివరాలపై ఆరా తీసి ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తున్నట్లు, పశు గణన ద్వారా జిల్లాలో పశువుల లెక్క పక్కాగా తేలనుందని తెలిపారు. దీని ఆధారంగా సంబంధిత వ్యాక్సిన్లు, ప్రభుత్వ సబ్సిడీ దానా తదితరాలపై ప్రభుత్వాలు సులభంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె.వెంకట్ నారాయణ, జిల్లా ఉప పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, పశు వైద్యాధికారులు ప్రవీణ్, దీపిక, వినయ్, విక్రమ్, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment