No Headline
హన్మకొండ కల్చరల్ :
కార్తీక మాసం అనేక విశేషాల పవిత్రమైన మాసం. ఈ మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల సందడి కనిపిస్తుంది. అందరూ భక్తిభావంతో పూజలు చేస్తూ సరదాగా ఆట, పాటలతో గడుపుతారు. ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ కులాలు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వనభోజనాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్తీక మాసంలో వనభోజనాల ప్రత్యేకతలపై ఈ వారం ప్రత్యేక కథనం.
వనంతోనే ఆనందం..
కార్తీక మాసం వనభోజనం అంటే ఎక్కడపడితే అక్కడ చేసే కార్యక్రమం కాదు. వనభోజనానికి ఆహ్లాదకరమైన ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వనభోజనాలకు రకరకాల ఫల, పుష్ప, వృక్షాలు కలిగిన ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసి వంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుంచి తెచ్చినవి కాకుండా ఆహార పదార్థాలు అక్కడే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మేలు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి కార్తీక పూజలు చేయాలి. తర్వాత విస్తరాకుల్లో గానీ అరిటాకుల్లో గానీ అందరూ కలిసి భోజనం చేయాలి. ఇలా అందరూ కలిసి పనిచేయడంలో సహకార స్ఫూర్తి మనకు కనిపిస్తుంది.
ఆరోగ్య రహస్యం..
ప్రతీ ఆధ్యాత్మిక కార్యక్రమం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంటుంది. ముందు శ్రావణ, భాద్రపద మాసాలు వర్ష రుతువు కావడంతో ఆ నెలల్లో కురిసిన వర్షాలకు నేల మీద ఎన్నో మొక్కలు జీవం పోసుకుని కార్తీక మాసం వచ్చేసరికి చక్కగా పెరుగుతాయి. కార్తీక మాసంలో చీకటి పడిన తర్వాత కొంచెం చలి ప్రారంభమవుతుంది. కానీ, పగలు అటు ఎండ ఎక్కువగా లేకుండా, ఇటు మంచు పడకుండా ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో వర్ష రహితంగా అందరూ కలిసి జరుపుకునే వన సమారాధనల వల్ల వ్యక్తులు, కుటుంబాల మధ్య సమైక్యత ఏర్పడుతుందన్నది నమ్మకం. ఆ విధంగా ఆధ్యాత్మికం, ఆరోగ్య శాస్త్రాల మేళవింపుగా మన పూర్వీకులు ఏర్పరచినవే వన సమారాధనలు (వనభోజనాలు).
ఆటలు.. పాటలు..
కార్తీక వనభోజనాల్లో తమ తమ కమ్యూనిటీలో మంచిచెడులను చర్చించుకుంటారు. అందరూ కలిసి ఐక్యతను చాటేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెద్దలు, పిల్లలు వేర్వేరుగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీని వల్ల రోజువారీ పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆటలపోటీల్లో రాణించిన వారికి బహుమతులను అందజేయడం వల్ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.
కార్తీక వనభోజనాలు (ఫైల్)
నేడు వనభోజనాలకు సర్వం సిద్ధం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కులాల వారీగా ప్రజలు వనభోజనాలకు సర్వం సిద్ధమయ్యారు. ఆలయాలు, పార్కులు, చుట్టుపక్కల ఉన్న పండ్ల తోటలు, విశాలమైన ప్రదేశాల్లో ఆదివారం వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా త్రికోట పరిసరాలు, వనవిజ్ఞాన కేంద్రం, ఏకశిల చిల్డ్రన్స్ పార్కు, వరంగల్ కోటి లింగాల దేవాలయం, ఖిలావరంగల్ వాకర్స్ మైదానంలో పద్మశాలీలు, గౌడ, మున్నూరుకాపు, ఆర్యవైశ్య, ఇతర కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్దఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఉసిరి, తులసి మొక్కలకు పూజలు
వనభోజనాల సందర్భంగా కొన్ని ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలను నిర్దేశించారు. వనభోజనం ఉసిరి చెట్టు ఉన్న చోట చేయాలి. ఉసిరి చెట్టును విష్ణుమూర్తికి ప్రతిరూపంగా పురాణాల్లో పేర్కొన్నారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈకార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసి మొక్కను ఉంచి పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, లక్ష్మీనారాయణ ఆశీస్సులతో సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. అందుకే అనేక మంది ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి కొమ్మను తీసుకు వచ్చి ఒకచోట గుచ్చి దానికి పూజ చేసి అనంతరం అక్కడ సామూహికంగా వనభోజనం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment