గంటలో వ్యాపారి ఇల్లు గుల్ల!
కాజీపేట: భార్య ఆస్పత్రికి వెళ్లింది. భర్త.. పిల్ల లను ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లాడు. గంట వ్యవధిలోనే ఇల్లును దొంగలు లూటీ చేశారు. రూ.14లక్షల విలువ చేసే బంగారు నగలను అపహరించారు. శుక్రవారం రాత్రి కాజీపేట పట్టణంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితులు శనివారం కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన దావ కిశోర్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. శుక్రవారం సాయంత్రం తన భార్య ఆస్పత్రికి వెళ్లగా కిశోర్ ఇంటికి తాళం వేసి పిల్ల లను ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. రాత్రి 8: 30గంటల సమయంలో కిశోర్ భార్య ఇంటికి రాగా తాళం పగులగొట్టి ఉండటం చూసి వెంటనే భర్తకు ఫోన్ చేసింది. ఆయన హుటాహుటిన ఇంటికి వచ్చాడు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 35 తులాల బంగారం నగలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
క్లూస్ కోసం అధికారుల ప్రయత్నాలు..
ఏసీపీ తిరుమల్తోపాటు, సీఐ సుధాకర్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది జాగిలాల సహాయంతో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్‌టీం సిబ్బంది తాళంతోపాటు బీరువాపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దొంగలు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో వాహనాన్ని ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. సీపీ అంబర్ కిశోర్ ఝా ఆదేశం మేరకు ఎస్సై నవీన్‌కుమార్‌తోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గంట సేపటిలోనే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చేసి పరారవడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
రూ.14లక్షల విలువ చేసే బంగారు నగలు అపహరించిన దొంగలు
కాజీపేటలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment