కొడుకునుంచి రక్షణ కల్పించండి
● పోలీసులను ఆశ్రయించిన ఓ తండ్రి
కమలాపూర్ : ‘నా కొడుకు నుంచి నన్ను కాపాడండ’ని వేడుకుంటూ ఓ కన్నతండ్రి పోలీసులను ఆశ్రయించిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరులో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు పాక కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు గ్రామానికి చెందిన కుమారస్వామికి (60) ఇద్దరు కుమారులు. భార్య ఆరేళ్ల క్రితం మృతిచెందింది. కుమారులిద్దరు తనను పట్టించుకోకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోగా బతుకుదెరువు కోసం కుమారస్వామికి ఉన్న భూమిలో పంట సాగు చేసుకొని బతకమని చెప్పారు. దీంతో హమాలీ పని చేసుకుంటూ, తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. తాను పండించిన వరిని కోసి ట్రాక్టర్‌లో మిల్లుకు తీసుకెళ్తుండగా శనివారం అతని పెద్ద కొడుకు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న పాక తిరుపతిరాజు వచ్చి రూ.50 వేలు ఇవ్వమని ఇష్టం వచ్చినట్లు దూషించాడు. కాగా తన దగ్గర డబ్బులు లేవని, నా బతుకేదో నేనే బతుకుతున్నానని అన్నందుకు ట్రాక్టర్‌లోని వడ్లను పొలంలో పారబోసి రూ.లక్ష నష్టం కలిగించాడన్నారు. నన్ను చంపి పొలాన్ని ఆక్రమించుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడని, తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుమారస్వామి తెలిపాడు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్ హరికృష్ణను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment