వనమాల కనపర్తి క్వారీల్లో తనిఖీ
ఐనవోలు : మండలంలోని వనమాల కనపర్తిలో గల 8 గ్రానైట్ క్వారీలను మైనింగ్ ఆర్‌ఐ చంద్రకళ, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎస్సై పస్తం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం తనిఖీ చేశారు. గత నెల 25న గ్రానైట్ క్వారీల్లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సుబోద్ యాదవ్‌తో తనకు తెలియని పనిని యజమాన్యం బలవంతంగా చేయించడంతో ప్రమాదం జరిగి మృతిచెందాడు. అయితే గుట్టు చప్పుడు కాకుండా సుబోద్ యాదవ్ ప్రాణానికి యజమాన్యం రూ.8లక్షలు ఖరీదు కట్టి తమపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు.ఇదే విషయాన్ని ‘ప్రాణం ఖరీదు రూ.8లక్షలు’ శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించింది. అదేవిధంగా గ్రానైట్ క్వారీల్లో ఏం జరుగుతోంది? శీర్షికన మరో కథనం ప్రచురించి, పలు అంశాలను వెలుగులోకి తెచ్చింది. కార్మికులను యజమాన్యాలు శ్రమదోపిడీ చేస్తున్న తీరును, క్వారీ ప్రమాదాల్లో మరణించిన వారికి లక్షల్లో నగదు అందించి చేతులు దులుపుకుంటున్న తీరును, కార్మికులకు సరైన భద్రతను అందించడం లేదనే విషయాలను ఎత్తిచూపింది. అదేవిధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న అంశాలను ప్రస్తావించింది. క్వారీలకు లీజు అనుమతులు ఉన్నాయా, రాయల్టీ సరిగా చెల్లిస్తున్నారా, నిబంధనల మేరకే గ్రానైట్‌ను తరలిస్తున్నారా? హద్దురాళ్లు సరిగా ఉన్నాయా? రాత్రిళ్లు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా సిటీకి మొరం తరలింపు తదితర అంశాలపై పలు ఫిర్యాదులు రాగా ఎట్టకేలకు శనివారం తనఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అధికారులు గ్రానైట్ యజమాన్యాలను లీజు అగ్రిమెంట్లు అడుగగా 8 క్వారీల్లో కేవలం ఇద్దరు మాత్రమే అందజేశారని తహసీల్దార్ విక్రమ్ కుమార్ తెలిపారు. హద్దు రాళ్ల గురించి వాకబు చేయగా గుట్టపైన ఉన్నట్లు నిర్వాహకులు చెప్పారన్నారు. అందరి లీజు అగ్రిమెంట్లను రెండు రోజుల్లో పరిశీలించి మండల రెవెన్యూ సర్వేయర్ ద్వారా హద్దుల నిర్ణయం చేయనున్నట్లు తెలిపారు. కాగా అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి పై స్థాయిలో వచ్చే ఒత్తిడులతో వదిలేస్తారా లేదా జవాబుదారిగా పనిచేసి తనిఖీల్లో వెలువడిన అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment