కొండ చిలువ హతం
పరకాల: గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కొండ చిలువ హతమైంది. ఈఘటన పరకాల పట్టణంలో బుధవారం జరిగింది. పరకాల కొత్త మున్సిపాలిటీ రోడ్డులోని జర్నలిస్ట్ కాలనీ వద్ద రోడ్డు పక్కన కొండ చిలువ ఉన్నట్లు వాహనదారులు కొందరు కాలనీవాసులకు తెలిపారు. వెళ్లి చూడగా.. అప్పటికే బండరాళ్లతో కొట్టి చంపినట్లుగా స్థానికులు గుర్తించారు. అయితే కొంతకాలంగా పరకాల పట్టణ శివారు ప్రాంతాల్లో కొండ చిలువల సంచారం పెరిగింది. కొద్ది రోజుల క్రితం మల్లక్‌పేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ శిథిల భవన ప్రాంగణంలో కొండ చిలువ పిల్లలు కనిపించాయి. ఆతర్వాత మూడు రోజులకు అదే హాస్టల్ సమీపంలో రోడ్డు దాటుతూ.. ఓ భారీ కొండ చిలువ వాహనదారులకు కనిపించింది. కొందరు వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదు. మరో కొండచిలువ పరకాల కొత్త మున్సిపాలిటీ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చనిపోయి కనిపించింది. కొండచిలువ సంచారం సమాచారం తెలియగానే ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుని వాటిని అడవికి తరలిస్తే మూగజీవాలు బతికి ఉంటాయని.. లేదంటే స్థానికులు భయంతో వాటిని చంపుతారని కాలనీవాసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment