సాధికారత ఊసే లేదు.. ఉపాధి పట్టదు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నవశకం పథకాలు
పథకం లబ్ధిదారులు లబ్ధి
(రూ.కోట్లలో)
కాపునేస్తం 1,12,017 168.00
చేయూత 1,95,728 366.47
చేదోడు 29,102 29.10
ఈబీసీ నేస్తం 25,457 38.18
ఇంటికే రేషన్ 239
వాహనాలు 13.50
మొత్తం 615.25
భీమవరం(ప్రకాశం చౌక్) : రాష్ట్రంలో మహిళా సాధికారత.. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవశకం పేరిట సంక్షేమ పథకాలను అమలు చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి బీసీ కార్పొరేషన్ ద్వారా నవశకం పేరిట ఐదు పథకాలను చిత్తశుద్ధితో అమలు చేశారు. ఏటా క్యాలెండర్‌ను ప్రకటించి నిర్ణీత సమయంలో లబ్ధిదారులకు సాయం అందించడం ద్వారా చిన్నపాటి వ్యాపా రాలు, స్వయం ఉపాధికి భరోసాగా నిలిచారు. కాపునేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, ఇంటింటికీ రేషన్ పథకాలను పక్కా గా అమలు చేసి పేదల ఆర్థిక పరిపుష్టికి తోడ్పాటు అందించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలుపై నిర్లక్ష్యం చూపుతుండటంతో ఆయా వర్గాలకు ఆర్థిక భరోసా దూరమైంది. చిన్నపాటి వ్యాపారాల నిర్వహణ, కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది.
వ్యాపారం.. దినదినగండం
కూటమి నేతలు ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ అంటూ హామీలను గుప్పించినా.. గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా విస్మరించారు. దీంతో పథకాల లబ్ధి అందక గత ప్రభుత్వంలో నవశకం ప్రోత్సాహంతో ప్రారంభించిన వ్యాపారాల నిర్వహణకు ప్రస్తుతం లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పెట్టుబడులు లేక, అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. అద్దె షాపుల్లో వృత్తిపరమైన పనులు చేసుకునేవారికి గడ్డుకాలం నడుస్తోంది. ప్రైవేట్ అప్పుల బాట పడుతున్నారు. అలాగే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో పలువురు మహిళలు చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించారు. ముఖ్యంగా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. వీరంతా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో వ్యాపారాల నిర్వహణ ఎలా అని ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో రూ.615 కోట్ల లబ్ధి
గత ప్రభుత్వంలో నవశకం కింద ఐదు పథకాలకు సుమారు రూ.615.25 కోట్లు ఖర్చు చేశారు. జగన్ పాలన చేపట్టిన మొదటి ఏడాది నుంచే పథకాల లబ్ధి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. కరోనా విపత్తు సమయంలోనూ పథకాల ద్వారా ప్రజలను ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ పథకాలపై స్పష్టత ఇవ్వడం లేదు.
మహిళల ‘కాపు’ కాసిన నేస్తం
గత ప్రభుత్వం కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు సాయం అందించింది. దీంతో పలువురు చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించారు. జిల్లాలో 2020–21లో 24,199 మందికి రూ.36.29 కోట్లు, 2021–2022లో 21,815 మందికి రూ.32.71 కోట్లు, 2022–2023లో 31,361 మందికి రూ.47.04 కోట్లు, 2023–2024లో 34,642 మందికి రూ.51.96 కోట్ల సాయం అందించారు. మొత్తంగా 1,12,017 మందికి రూ.168 కోట్ల లబ్ధిని చేకూర్చారు.
వృత్తిదారులకు ‘చేదోడు’వాదోడుగా..
టైలర్, రజక, నాయిబ్రాహ్మణ వృత్తి చేసుకునేవారికి షాపు అద్దెలు, విద్యుత్ బిల్లులకు సాయంగా చేదోడు పథకం అమలు చేశారు. ఏడాదికి రూ.10 వేల చొప్పున నాలుగు విడతల్లో రూ.40 వేల లబ్ధి చేకూర్చారు. జిల్లాలో 2020–21లో 10,007 మందికి రూ.10 కోట్లు, 2021–2022లో 9,056 మందికి రూ.9.05 కోట్లు, 2022–2023లో 10,348 మందికి రూ.10.34 కోట్లు, 2023–2024లో 9,698 మందికి రూ.9.69 కోట్ల లబ్ధి చేకూర్చారు. మొత్తంగా 29,102 మందికి రూ.29.10 కోట్ల సాయం అందించారు.
అగ్రవర్ణాలను ఆదుకున్న ఈబీసీ నేస్తం
అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున రెండు విడతల్లో రూ.30 వేలు అందించారు. మూడో విడత సాయం అందించేలోపు ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. జిల్లాలో 2021–2022లో 11,997 మందికి రూ.17.99 కోట్లు, 2022–23లో 13,460 మందికి రూ.20.19 కోట్లు అందజేశారు. మొత్తంగా 25,457 మందికి రూ.38.18 కోట్ల లబ్ధి చేకూర్చారు.
ఇంటికే రేషన్‌తో ఉపాధి
రేషన్ దుకాణాలకు వెళ్లి నిత్యావసరాల తెచ్చుకోవడంలో ఇబ్బందులను గుర్తించిన గత ప్రభుత్వం ఇంటికే రేషన్ విధానాన్ని అమలు చేసింది. రేషన్ వాహనాల ఏర్పాటు ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించింది. రూ.5.81 లక్షల విలువైన వాహనాన్ని రాయితీపై అందించింది. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 239 వాహనాలకు రూ.13.50 కోట్లు ఖర్చు చేసింది. ఈ వాహనాలను ఇటీవల విజయవాడ వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంది.
నాడు నవశకం.. నేడు అంతా శూన్యం
జగన్ సర్కారులో నవశకం పేరిట పథకాల అమలు
జిల్లాలో రూ.615 కోట్లకు పైగా ఖర్చు
మహిళా సాధికారత.. యువత ఉపాధికి పెద్దపీట
నేడు పథకాలు అందక.. సాయం దరిచేరక అవస్థలు
ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ప్రజల ఎదురుచూపులు
నాడు బడుగులకు నిండుగా ‘చేయూత’
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల సాయం అందించారు. ఎన్నికల అనంతరం కూడా జిల్లాలో 23 వేల మందికి ఆఖరి సంవత్సం సాయం అందించారు. వీటితో మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. జిల్లాలో 2020–21లో 51,516 మందికి రూ.96.59 కోట్లు, 2021–2022లో 51,000 మందికి రూ.95.62 కోట్లు, 2022–2023లో 70,212 మందికి రూ.131.14 కోట్లు, 2023–2024లో 23,000 మందికి రూ.43.12 కోట్లు సాయం అందించారు. మొత్తంగా 1,95,728 మందికి రూ.366.47 కోట్ల సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment