‘కమర్షియల్’గా వాడేస్తున్నారు
భీమవరం (ప్రకాశం చౌక్): రవాణాకు ఉపయోగించే వాహనాలకు పసుపు రంగు నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అయితే కొందరు తెలుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలను రవాణాకు వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ కిరాయిలకు తిప్పుతున్నా రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కువగా తెలుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన కార్లను కిరాయిలకు తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
జోరుగా దందా
తెలుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన కార్లు సొంత కార్లు అని అర్థం. వాటిని కిరాయికి వినియోగించడం నేరం. కానీ కొందరు తెలుపు రంగు నంబరు ప్లేట్‌తో ఉన్న కార్లను వారి ఇష్టానుసారం కిరాయిలకు తిప్పుతున్నారు. కిలోమీటర్ల దూరానికి వారే ధర నిర్ణయించుకుని ప్రజలను దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ వ్యాపారం పెద్దఎత్తున సాగుతోంది. కొందరు ట్రాన్స్‌పోర్టు పేరు పెట్టి మరీ తెలుపు రంగు నంబరు ప్లేట్ కలిగిన కార్లతో ఈ తరహా వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో భీమవరంతోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు పేరుతో 5 నుంచి 10 కార్లు నడేపేవారు నెలకు ఒక రేటు, రోజుకు అయితే మరో రేటు పెట్టి కిరాయిలు వసూళ్లు చేస్తున్నారు. ఇలాంటి కార్లు జిల్లాలో సుమారు 5 వేలకు పైనే ఉన్నాయి. నిబంధనల మేరకు ట్రాన్స్‌పోర్టు చేసే కార్లు జిల్లాలో సుమారు 1,000 నుంచి 1,500 లోపే ఉన్నాయంటే దీనిని బట్టి ఈ వ్యాపారం ఏ మేరకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
బీమా కోల్పోతారు
వాహన చట్ట ప్రకారం కిరాయికి ప్రయాణికుల్ని తరలించడానికి (ట్యాక్సీ) కారుకు పసుపు రంగు నంబరు ప్లేట్‌ను కేటాయిస్తారు. ఈ రంగు నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్‌కు అధిక ఖర్చు అవుతుంది. ఇలాంటి కారుకు బీమా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పర్మిట్, ఫిట్‌నెస్ పరీక్షలు రెండేళ్లకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే కారులో ప్రయాణించే అందరికీ బీమా వర్తిస్తుంది. అదే తెలుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన కారులో ప్రయాణించే వారికి బీమా తక్కువ ఉంటుంది. అలాగే 15 ఏళ్లకు లైఫ్, ఇతర రవాణా శాఖ ఖర్చులు తక్కువగా ఉంటాయి. పసుపు రంగు ప్లేట్ కలిగిన కారుకు రవాణా శాఖ అనుమతుల పొందాలంటే ఖర్చు 10 నుంచి 20 శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో కొందరు ఖర్చు తగ్గించుకునేందుకు తెలుపు రంగు నంబర్ ప్లేట్ కారు (సొంత కారు) తీసుకుని నిబంధనలు అతిక్రమించి రవాణా వ్యాపారం సాగిస్తున్నారు.
తెలుపు నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలు కిరాయికి తిప్పుతూ దోపిడీ
నిబంధనలు అతిక్రమిస్తున్నా పట్టించుకోని రవాణా శాఖ
చర్యలు తీసుకుంటాం
తెలుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన కార్లను రవాణాకు ఉపయోగించడం నేరం. కేవలం పసుపు రంగు నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ చేసిన కార్లను మాత్రమే రవాణాకు, కిరాయికి ఉపయోగించాలి. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. నిబంధనలు ఉల్లంఘించి ట్రాన్స్‌పోర్టు చేస్తున్న కార్లను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నాం.
– టి.ఉమామహేశ్వరరావు జిల్లా రవాణా శాఖ అధికారి భీమవరం
Comments
Please login to add a commentAdd a comment