ఆక్వా వర్సిటీకి చంద్ర గ్రహణం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రతిష్టాత్మక ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ పనుల్ని కూటమి సర్కారు అటకెక్కించింది. ఇప్పటికే రూ.30 కోట్ల మేర పనులు జరగ్గా, బిల్లులు విడుదలవక నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి. మరోవైపు ఈ ఏడాది అడ్మిషన్లు మొదలుకాగా ప్రస్తుతం క్యాంపస్ కాలేజీ నిర్వహిస్తున్న తాత్కాలిక భవనం సరిపోక తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా హబ్‌గా ప్రసిద్ధి చెందింది. భీమవరం, ఉండి, కై కలూరు తదితర నియోజకవర్గాల్లోని 2.53 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. జిల్లాలోని 15కు పైగా ప్రాన్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా రొయ్యలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. చేపలు, రొయ్యల మేతలు, చెరువుల నిర్వహణ సామగ్రి అమ్మకాలు, పట్టుబడి, ప్రాసెసింగ్ ప్లాంట్లు, రవాణా తదితర రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ఆక్వా రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేశారు. నరసాపురం కేంద్రంగా ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం, జిల్లాలోని ఉండిలోని ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్లను యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. యూనివర్సిటీ కోసం నరసాపురం పక్కనే లిఖితపూడిలో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్యాంపస్ కాలేజీ, బాయ్స్, గర్‌ల్స్ హాస్టల్ భవన నిర్మాణాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేశారు. తాత్కాలికంగా నరసాపురంలోని తుఫాన్ షెల్టర్ భవనంలో గతేడాది నవంబరు నుంచి 66 సీట్లతో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ తరగతులు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 1992లో క్యాంపస్ కళాశాల ప్రారంభించగా నరసాపురంలోని కళాశాల రాష్ట్రంలోనే రెండోది కావడం గమనార్హం. ఈ ఏడాది నూతన భవనాల్లో ఆక్వా వర్సిటీ, క్యాంపస్ కళాశాలను ప్రారంభించడం లక్ష్యంగా గత ప్రభుత్వంలో శరవేగంగా పనులు చేయించారు.
మందగించిన పనులు
అడ్మినిస్ట్రేటివ్, కళాశాల భవనాలకు సంబంధించి పనులు శ్లాబ్ దశకు చేరుకోగా బాయ్స్, గర్‌ల్స్ హాస్టల్ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. ఇంతవరకు రూ.30 కోట్ల విలువైన పనులు జరగ్గా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకుండా జాప్యం చేయడం నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పనులు మందగించగా మరో వారం పది రోజుల్లో బిల్లులు రాకుంటే పనులు నిలుపుదల చేసే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలోని మత్య్సశాఖ భవనాల్లోకి తరలిపోతుందన్న ప్రచారం ఉంది. భవనాల పనులు నిలిచిపోతే నరసాపురం ఆక్వా వర్సిటీపై నీలినీడలు కమ్ముకుంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెకండ్ బ్యాచ్‌కు సరిపోని తాత్కాలిక భవనం
ప్రస్తుతం నరసాపురంలోని 12 గదులతో ఉన్న తుపాను షెల్టర్ భవనంలో తాత్కాలికంగా కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రెండో బ్యాచ్‌కు కౌన్సెలింగ్ మొదలుకాగా ఇప్పటికే 35 సీట్లు పూర్తయ్యాయి. తరగతి గదులు, ల్యాబ్, ఆఫీస్, లైబర్రీ, స్టాఫ్ రూమ్ ప్రస్తుతం ఉన్న భవనంలో ఒక బ్యాచ్‌కు మాత్రమే సరిపోతుంది. ఈ ఏడాది నుంచి రెండో బ్యాచ్ క్లాసులు మొదలు పెట్టాల్సిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ భవనం వెదుకులాటలో అధికారులు ఉన్నారు. ఉండి కేవీకేలో ఫిషరీస్‌కు సంబంధించిన భవనాలు ఉండటంతో కళాశాలను అక్కడ నిర్వహించాలని అధికారులు భావించారు. కాగా నరసాపురం నుంచి కళాశాల వెళ్లిపోతే స్థానికంగా వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు ఆ ప్రయత్నాన్ని ఆపుచేయించినట్టు సమాచారం. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన బ్లాకులో కళాశాల నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. బిల్లులు విడుదల చేసి త్వరితగతిన యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నత్తనడకన సాగుతున్న ఆక్వా వర్సిటీ నిర్మాణ పనులు
బిల్లుల విడుదలలో కూటమి సర్కారు జాప్యం
నత్తనడకన నిర్మాణ పనులు
పశ్చిమగోదావరి జిల్లాకు తలమానికంగా ఆక్వా వర్సిటీ
భవన నిర్మాణాలకు రూ.100 కోట్లు మంజూరు చేసిన జగన్ సర్కారు
రూ.30 కోట్ల విలువైన పనులు పూర్తి
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పనులకు బ్రేక్
ఆక్వా వర్సిటీ విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పనులు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాంతంలో ఆక్వా రంగం మరింత అభివృద్ధికి ఆక్వా వర్సిటీ దోహదపడుతుంది. యూనివర్సిటీకి సంబంధించిన భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా జిల్లాకు చెందిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రత్యేక చొరవ చూపాలి.
–వడ్డి రఘురాం, అప్సడా మాజీ వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment