చంద్రబాబు సూపర్ బాదుడు
తణుకు అర్బన్ : చంద్రబాబు ప్రజలకు సూపర్ బాదుడు చూపిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు కొండెక్కించి పేదలను అప్పుల పాలు చేస్తున్న ఘనత చంద్రబాబు మూటగట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని అధికారం ఇస్తే సంపద సృష్టిస్తానంటూ ప్రగల్బాలు పలికిన పెద్దమనిషి ఇప్పుడు దొరికినకాడికి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారని దుయ్యబట్టారు. నాణ్యమైన విద్యుత్‌ను ధరలు పెంచకుండా అందిస్తానని హామీ ఇచ్చి రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. నోరిప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడే చంద్రబాబు సూపర్ సిక్స్‌తో ప్రజలను మోసం చేశారని, బడ్జెట్‌లో వాటికి సరిపడా నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.
విద్యారంగం అధోగతి
జగన్ హయాంలో విద్యావ్యవస్థకు అందిన ప్రోత్సాహంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, నేడు కూటమి ప్రభుత్వంలో పిల్లలు బడికి వెళ్లని స్థితి వచ్చిందని కారుమూరి ఎద్దేవా చేశారు. తల్లికి వందనం తల్లికి అందకపోవడంతో తమ బిడ్డలను పాఠశాలలకు పంపించని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. జగన్ సంక్షేమంతో మహిళలు ఆర్థికంగా ఎదిగారని దీంతో చిన్నపాటి వ్యాపారాలు చేయడం వంటి అంశాలతో మార్కెట్‌లో కొనుగోలు శక్తి పెరిగి ఏపీ మొదటి స్థానంలో ఉండేదని ఇప్పుడు 15వ స్థానానికి దిగజారిపోయిందని తెలిపారు.
పెరిగిన ధరలతో జీవనం కష్టం
కందిపప్పు, మినపప్పు, వంటనూనెల ధరలతో ప్రజలు బతకడమే కష్టంగా మారిందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 20 లక్షలు ఉద్యోగాలు యువతకు అందిస్తామని, రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామన్న లోకేష్ కనిపించడంలేదని ఎద్దేవా చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ మాటేంటి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ గాలికొదిలేశారని, ఫీజు కడితేనే పరీక్షలు రాయిస్తామని యాజమాన్యాలు చెబుతుండడంతో తల్లిదండ్రులు అప్పులుచేసి కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కిడ్నాప్‌లకు వలంటీర్లే కారణమన్నట్లుగా మాట్లాడి వారిని తీవ్రంగా అవమానించిన పవన్ కల్యాణ్ నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బాలికలు, మహిళల కిడ్నాప్‌లు, దాడులు, హత్యలపై నోరెత్తరే అని నిలదీశారు. ఉచిత ఇసుకని ప్రగల్బాలు పలికి నేడు ఇసుక దొరక్కుండా చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని, మద్యం దుకాణాలు నేడు బార్లుగా మారాయని, ఇంటి వద్దకే మద్యం అన్నట్లుగా బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు.
సోషల్ మీడియాపై ఉక్కుపాదం
ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే ఉద్దేశంతో సోషల్ మీడియా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి అమాయకులను పోలీస్‌స్టేషన్లు, జైళ్లకు తిప్పుతున్నారని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని కారుమూరి హెచ్చరించారు. సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, విలేజ్ క్లినిక్‌ల ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే ఇప్పుడు మెడికల్ కళాశాలలను కూడా అవసరం లేదని వెనక్కి పంపిస్తున్న చంద్రబాబు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదా అని నిలదీశారు.
కొండెక్కిన నిత్యావసరాలు, కూరగాయల ధరలు
విద్యావ్యవస్థ నిర్వీర్యం
మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment