26న కలెక్టరేట్ల వద్ద ధర్నా
ఏలూరు (టూటౌన్): ఈ నెల 26న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. రైతుల ఆందోళన ఫలితంగా వ్యవసాయ నల్ల చట్టాలను అమలు చేయమని, రైతు డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలలో పాల్గొని అసువులు బాసిన 750 మంది రైతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ఇచ్చిన హామీ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి, రైతులు గుర్తించిన 52 పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులపై ముప్పేట దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ఇచ్చిన హామీ మేరకు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టే 4 లేబర్ కోడ్‌లు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడారు. సమావేశంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment