నేటి నుంచి దళిత వాడల్లో శ్రీవారి ధర్మప్రచారం
ద్వారకాతిరుమల : శ్రీవారి ధర్మప్రచార రథం సోమవారం నుంచి దళిత వాడల్లో పర్యటించనుందని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. ద్వారకాతిరుమలతో పాటు జంగారెడ్డిగూడెం మండలంలోని 8 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ధర్మప్రచారాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉదయం 8 గంటలకు ఆలయ జంటగోపురాల వద్ద ఈ ధర్మప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.
జోనల్ బ్యాండ్ పోటీల్లో ప్రథమం
తాడేపల్లిగూడెం రూరల్: కర్ణాటక రాష్ట్రం దావణగిరిలో జరిగిన జోనల్ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బ్యాండ్ టీమ్ ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ విషయాన్ని ఆదివారం స్కూలు ప్రిన్సిపల్ బి.రాజారావు తెలిపారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల నుంచి 33 టీంలు పాల్గొనగా, తమ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారని చెప్పారు. విద్యార్థులకు కర్ణాటక మంత్రి ఎస్‌ఎస్.మల్లిఖార్జున్, ఎంపీ ప్రభా మల్లికార్జున్ తదితరులు బహుమతి ప్రదానం చేశారన్నారు. న్యూఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో జరగనున్న గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక వారోత్సవాల్లో తమ విద్యార్థులు పాల్గొంటారని ప్రిన్సిపల్ రాజారావు తెలిపారు.
ఘనంగా సువర్చలా హనుమద్ కల్యాణం
జంగారెడ్డిగూడెం రూరల్ : గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి దర్శనార్ధం వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీస్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి, అర్చక స్వాములు శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణ క్రతువు నిర్వహించారు. ఈ కల్యాణ క్రతువులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద రాజానగరం, బాల రాజరాజేశ్వరి నాట్యమండలిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. దర్శనాలకు విచ్చేసిన భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయం మార్మోగింది. సుమారు 4,000 మంది భక్తులు స్వామి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు ఆదివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు భారతదేశంలో మహిళా సురక్షత – యువత పాత్ర, విద్యార్థి దశ ప్రాముఖ్యత లేదా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆధ్యాత్మికత అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అంతకు ముందు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏలూరు శాఖ ఆధ్వర్యంలో రాజయోగిని సిస్టర్ బీకే లావణ్య, బీకే హిమబిందు, బీకే బేబి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు మెమొరీ మేనేజ్‌మెంట్ – బ్రెయిన్ ఎక్సర్‌సైజ్ అనే అంశంపై సందేశాన్ని, ఆధ్యాత్మికతతో కూడిన శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు అధ్యక్షత వహించగా, బ్రహ్మకుమారిస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment