శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. న్యాయమూర్తి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో నిజరూపంలో ఉన్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ముఖ మండపంలో పండితులు, అర్చకులు ఆయనకు స్వామి వారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఆలయ డీఈఓ బాబురావు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
కల్లాల్లో ధాన్యం కొనరా ?
ఏలూరు (టూటౌన్): కృష్ణా డెల్టా పరిధిలో ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పూర్తయ్యాయనే పేరుతో రైతులు, కౌలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏంటని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ధాన్యం కొనుగోలులో సమస్యలపై ఆయన మాట్లాడారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కృష్ణా డెల్టా పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల పరిధిలో ధాన్యం సేకరించికపోవడం తగదన్నారు. అలాగే నాణ్యమైన గోనె సంచులు అందించాలన్నారు.
పటిష్టంగా మావుళ్లమ్మ ఉత్సవ ఏర్పాట్లు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మావుళ్లమ్మవారి ఆలయ 62వ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా రెవెన్యూ శాఖాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ భీమారావు తెలిపారు. ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించి నిర్వాహకులు, అధికారులకు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ అలంకరణ ఏర్పాట్లలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్యూలైన్లు పక్కాగా ఏర్పాటుచేయాలన్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, సిబ్బంది ఉన్నారు.
జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో 2025–26 నుంచి కొత్త ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు, ఇప్పటికే నిర్వహణలో ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రభుత్వ గుర్తింపు పునరుద్ధరణకు ఆయా యాజమాన్యాలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ముసునూరు, టి.నరసాపురంలో కొత్తగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొ న్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ సూపరింటెండెంట్‌ను సెల్ 9440431377 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
బీఎల్‌ఓల గౌరవ వేతనం విడుదల
ఏలూరు(మెట్రో): జిల్లాలో బీఎల్‌ఓలకు 2021 నుంచి రావాల్సిన గౌరవ వేతనాన్ని విడుదల చేస్తూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో రూ.1,82,59,500లు మంజూరు చేశారు. నియోజకవర్గాల వారీగా ఉంగుటూరుకు రూ.2.41 లక్షలు, దెందులూరుకు రూ.25.09 లక్షలు, ఏలూరుకు రూ.22.02 లక్షలు, పోలవరానికి రూ.29.82 లక్షలు, చింతలపూడికి రూ.28.60 లక్షలు, నూజివీడుకి రూ.30.03 లక్షలు, కై కలూరుకి రూ.24.61 లక్షలను విడుదల చేశారు. కలెక్టర్‌కు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment