విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం
నరసాపురం: విద్యాలయాల్లో గుణాత్మక, సృజనాత్మకతతో కూడిన విద్యాబోధన జరగాలని, విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం జరిగిన నరసాపురం వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ (75 ఏళ్లు) వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలు తొలగాలంటే అందరూ విద్యావంతులు కావాలన్నారు. విలువలతో కూడిన విద్య నేర్పించాలన్నారు. యువత పెడదారి పట్టకుండా విద్యాలయాల్లోనే వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. 1949లోనే విద్య ఆవశ్యకతను గుర్తించి వైఎన్ కళాశాలను స్థాపించిన యర్రమిల్లి నారాయణమూర్తి దార్శనికులని కొనియాడారు.
ప్రపంచవ్యాప్త గుర్తింపు : కళాశాల పూర్వ విద్యార్థులు హైకోర్టు రిటైర్డ్ జడ్జి గ్రంధి భవానీ ప్రసాద్, ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్, గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో పేరు తెచ్చుకున్నారని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ కృషిని అభినందించారు. అనంతరం కళాశాల 75 వసంతాల బుక్‌లెట్‌ను అతిధులు ఆవిష్కరించారు. ముందుగా పురందేశ్వరి కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని, మంత్రి నిమ్మల రామానాయుడు వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ డి.శ్రీవేద, కళాశాల పాలకవర్గం ప్రతినిధులు పొన్నపల్లి శ్రీరామారావు, పోలిశెట్టి రఘురామ్, బళ్ల వెంకటేశ్వరరావు, సీహెచ్ రెడ్డప్పధవేజీ, పీజీ కోర్సుల డైరెక్టర్ నిమ్మల చింతారావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment