సహకార ఉద్యోగుల సమ్మె హెచ్చరిక | - | Sakshi
Sakshi News home page

సహకార ఉద్యోగుల సమ్మె హెచ్చరిక

Published Sat, Jan 11 2025 12:51 AM | Last Updated on Sat, Jan 11 2025 12:51 AM

సహకార ఉద్యోగుల సమ్మె హెచ్చరిక

సహకార ఉద్యోగుల సమ్మె హెచ్చరిక

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే నిరవధిక సమ్మె చేపడతామని ఏపీ స్టేట్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి కె.సత్యనారాయణ హెచ్చరించారు. సంఘ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఏలూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ (డీసీసీబీ) వద్ద జరిగిన ధర్నాలో వారు మాట్లాడారు. ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. సొసైటీ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, గ్రాట్యూటీ చెల్లించాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ, సిబ్బందిని కుదించే ఆలోచనలు మానుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌, సత్యనారాయణ మాట్లాడుతూ 2019లో జారీ చేసిన జీఓ 36ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. డీసీసీబీ, ఆప్కాబ్‌ తమ వంతు ని ధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డీసీసీబీ, ఆప్కాబ్‌ కాలక్షేపం

పీఏసీఎస్‌లకు డివిడెండ్లు ఇవ్వకుండా, సిబ్బంది వేతనాల ఖర్చుల్లో తమ వాటాలు భరించకుండా డీసీసీబీ, ఆప్కాబ్‌లు కాలక్షేపం చేస్తున్నాయని సత్యనారాయణ విమర్శించారు. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సహకార సంఘాలను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 2019, 2024 వేతన సవరణ వెంటనే చేపట్టి సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. 2019 తర్వాత పీఏసీఎస్‌లలో చేరిన వారిని తొలగించరాదని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు విజయభాస్కర్‌, కార్యదర్శి కృష్ణశాస్త్రి, ఏలూరు జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, కార్యదర్శి పి.సుబ్బారావు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సీహెచ్‌ వెంకటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు కె.రాజారామ్మోహన్‌రాయ్‌, డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడారు. అనంతరం సీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలపై అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని సీఈఓ హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement