ప్రభుత్వ తీరుపై అంబికా కృష్ణ అసంతృప్తి
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానాలు, సమాచారాలు అందించకపోవడం బాధాకరమని చెప్పారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సమష్టి కృషి వల్లే అధికారం చేతికొచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకులకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కనీసం తమ నాయకుడు అమిత్ షా విజయవాడ పర్యటనకు విచ్చేసిన సమయంలోనూ బీజేపీ కార్యకర్తలను, నాయకులను విస్మరించడం ఎంతో కలిచివేసిందని చెప్పారు. దీనిపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, మహిళా మోర్చ రాష్ట అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా అయినంపూడి శ్రీదేవి
భీమవరం: బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా అయినంపూడి శ్రీదేవిని ఎన్నుకున్నారు. మంగళవారం పట్టణంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాల మేరకు జిల్లా అధ్యక్ష పదవిని మహిళలకు కేటాయించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు శ్రీదేవిని ఎంపిక చేసినట్లు చెప్పారు.
భద్రతా నియమాలు పాటించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంగళవారం భీమవరంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. డ్రైవర్లుకు కంటి చూపును కాపాడుకోవాలని పలువురు వక్తలు, జిల్లా రవాణాశాఖ అధికారి తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు భాగంగా, భీమవరంలోని జగదీష్ మైరెన్ ప్రైవేట్ లిమిటెడ్, మాక్సివిజన్ ఐ హాస్పటల్ సహకారంతో పలువురు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. 135 మంది డ్రైవర్లకు నిర్వహించగా, అందులో 76 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. కార్యక్రమంలో భీమవరం మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకట రమణ, కెఎస్‌ఎన్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment