చినికి చినికి గాలివానలా..
ఉద్రిక్తతకు దారితీసిన శ్మశాన వాటిక వ్యవహారం
తణుకు అర్బన్: తణుకు ఇరగవరం కాలనీలో వివాదాస్పదంగా మారిన దళిత వర్గాల శ్మశాన వాటిక వ్యవహారం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాలనీలోని 11, 12, 13 వార్డులకు సంబంధించి మాలలకు చెందిన శ్మశాన వాటికలో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. దీంతో పట్టణ సీఐ కొండయ్య తమ సిబ్బందితో కలిసి నిరసన శిబిరం వద్ద టెంట్ తొలగించేందుకు ప్రయత్నించినా దళిత వర్గాలు పట్టు వదలకపోవడంతో విరమించుకున్నారు. మధ్యాహ్నం నుంచి కొనసాగిన ఈ నిరసన కారణంగా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. శ్మశానవాటిక ప్రాంతం తమకు సరిపోవడంలేదని పిచ్చిమొక్కలతో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్‌ను కోరారు. చిన్న పనులైతే మునిసిపాలిటీ తరఫున చేయిస్తామని పెద్దవి ఇప్పట్లో చేయలేమని చెప్పారు. శ్మశానం బాగు పనులు తామే చేసుకుంటామని ఒప్పించి చెట్లను తొలగించారు. అయితే కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు వచ్చి పనులను నిలిపివేశారని దళితులు ఆరోపించారు. కమిషనర్‌ను కలిసిన సమయంలో కించపరిచేలా మాట్లాడారని ఆయన తమకు క్షమాపణ చెప్పాల్సిందేనని దళితవర్గాలు డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగించాయి.
Comments
Please login to add a commentAdd a comment