4న జిల్లా కోర్టులో మెగా హెల్త్ క్యాంప్
భువనగిరి క్రైం : ఎయిమ్స్ సహకారం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన భువనగిరిలోని జిల్లా కోర్టులో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.హరినాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో క్యాన్సర్, కార్డియాలజీ, ఈఎన్‌టీ, కంటి నిపుణులు, జనరల్ మెడిసిన్‌తో కూడిన వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బందితో పాటు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా ప్రధాన జడ్జి ఏ.జయరాజు, ఇతర న్యాయమూర్తులు మెడికల్ క్యాంప్‌కు హాజరకానున్నట్లు తెలిపారు.
భూగర్భ జలవనరుల శాఖ సహాయ అధికారిగా ఎంపిక
ఆత్మకూరు(ఎం) : భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్ర సహాయ అధికారిగా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన గడ్డమీది శ్రీకాంత్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన గద్వాల జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డమీది కనకయ్య మూడవ కుమారుడు శ్రీకాంత్ 5వ తరగతి వరకు స్థానికంగా, 6వ తరగతి నుంచి ఉన్నత చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేశారు.
యాదాద్రిలో
ఆధ్యాత్మిక పర్వాలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఆధ్యాత్మికపర్వాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సుప్రభాతం సేవ, అర్చన, అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో స్వామి, అమ్మవారి సేవను ఊరేగించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
డీజేలకు అనుమతి లేదు
భువనగిరి క్రైం : రాచకొండ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజేలను నిషేధిస్తూ సీపీ సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజే సౌండ్ వల్ల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని, చిన్న పిల్లలకు శాశ్వత వినికిడి సమస్య రానుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు కమీషనరేట్ పరిధిలో జరిగే ఊరేగింపుల్లో డీజేలు, బాణా సంచాలు కాల్చడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంభిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర్వులు అమలు చేయాలని కమిషనరేట్ పరిధిలోని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment