ప్రజావాణికి అధికారులు డుమ్మా
సాక్షి, యాదాద్రి : ప్రజావాణికి హాజరుకాని అధికారులపై కలెక్టర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి దాదాపు 48 శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉంది. కానీ, అందులో 15 శాఖల అధికారులు హాజరుకాలేదు. వారి బదులు కిందిస్థాయి ఉద్యోగులను పంపడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజావాణికి డుమ్మాకొట్టిన అధికారుల వివరాలు తెలుసుకున్నారు. కొందరు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా కలెక్టర్ తమ పేర్లను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలుసుకున్న కొందరు అధికారులు.. హుటాహుటిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు సంజాయిషీ ఇచ్చారు.
అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపండి
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, బాధితులను తిప్పుకోవద్దని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. అదనపు కలెక్టర్లు, వీరారెడ్డి, గంగాధర్, జెడ్పీ సీఈఓ శోభారాణి, ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 48 వినతులు వచ్చినట్లు తెలిపారు. అందులో రెవెన్యూ సమస్యలకు సంబంధించి 24 వినతులు ఉన్నట్లు తెలిపారు. అర్జీల పరిష్కారానికి చేపడుతున్న చర్యలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వినతులు ఇలా..
● గీత కార్మిక సంఘాన్ని సొసైటీగా మార్చాలని కోరుతూ రాజాపేట మండలం కుర్రారం గీత కార్మిక సంఘం నాయకులు పాండవులు, భానుప్రకాష్‌గౌడ్ కలెక్టర్‌కు విన్నవించారు.
● మాసాపేట శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 104లో కొంత భూమిని కొందరు ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాహుపేట గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
● కులగణన సర్వేలో ఎన్యూమరేటర్లు నింపే ఫార్మట్‌ను చూసుకునే అవకాశం కల్పించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో విన్నవించారు.
ఫ 15 శాఖల నుంచి గైర్హాజరు
ఫ కలెక్టర్ సీరియస్
ఫ షోకాజ్ నోటీసులు జారీ
Comments
Please login to add a commentAdd a comment