చదువుతోనే సరి.. ఆటలేవీ!
చౌటుప్పల్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలకు ఆదరణ కరువైంది. చదువుతో పాటు క్రీడలు ఉన్నప్పుడే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉంటారు. కానీ, మెజార్టీ స్కూళ్లలో విద్యార్థులు ఆడుకునేందుకు మైదానాలు లేవు. కనీసం క్రీడా పరికరాలు కూడా సమకూర్చడం లేదు. వీటితో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఉంది. అందుబాటులో ఉన్న పీఈటీ, పీఈడీలు బోధన, కార్యాలయాల పనుల్లో మునిగిపోతున్నారు. మరోవైపు క్రీడలకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించకపోవడంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు.
అమలు కాని మాక్ డ్రిల్
జిల్లాలో 732 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. వాటిలో సుమారు 45వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ విద్యకు తగిన ప్రాధాన్యం లేదు. రోజూ ఎనిమిది పీరియడ్లలో ఏదో ఒక పీరియడ్ వ్యాయామ విద్యకు కేటాయించాలి. కానీ, మైదానాల కొరత, క్రీడా పరికరాలు లేకపోవడంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ఆ దిశగా దృష్టి సారించడం లేదు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా మాక్‌డ్రిల్ నిర్వహించాల్సి ఉన్నా అమలు చేయడం లేదు.
చౌటుప్పల్ మండలంలో ఇదీ పరిస్థితి
● చౌటుప్పల్ మున్సిపాలిటీతోపాటు చౌటుప్పల్ మండలంలో 16 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 2,040మంది విద్యార్థులు ఉన్నారు. దండుమల్కాపురం, కొయ్యలగూడెం, పీపల్‌పహాడ్, చిన్నకొండూరు, నేలపట్ల, జైకేసారం, పంతంగి, తంగడపల్లి, చౌటుప్పల్ ఉన్నత పాఠశాలల్లోనే పీఈటీలు ఉన్నారు. ఈ పాఠశాలల్లో క్రీడా స్థలాలున్నా క్రీడలకు సరైన ప్రాధాన్యంఇవ్వడం లేదు.
● తుఫ్రాన్‌పేట, డి.నాగారం, కుంట్లగూడెం, ఎస్.లింగోటం, అంకిరెడ్డిగూడెం, ఆరెగూడెం, లింగోజిగూడెం పాఠశాలలకు పీఈటీలు లేరు. పీఈటీ పోస్టులను ఇప్పటికీ ప్రభుత్వం మంజూరు చేయలేదు.
మొక్కుబడిగా ఎస్‌జీఎఫ్ సేవలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఏటా క్రీడల వార్షిక క్యాలెండర్ రూపొందించాలి. క్రీడా క్యాలెండర్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ, పథకం సరిగా అమలుకు నోచుకోకపోవడంతో జిల్లాలోని క్రీడా అసోసియేషన్లు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాయి. నిధుల కొరత కారణంగా అవికూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ఏటా రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు నిధులు మంజూరవుతున్నా అవి దేనికీ చాలడం లేదని వ్యాయామ ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
వ్యాయామ విద్యకు దక్కని ప్రాధాన్యం
మెజార్టీ స్కూళ్లలో
ఆడుకునేందుకు జాగ కరువు
పీఈటీలు, పీఈడీలూ లేరు
నిధులు కేటాయించని ప్రభుత్వం
ఆటలకు దూరమవుతున్న విద్యార్థులు
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు
గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడంతో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం. ఏటా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించాలన్నా నిధుల లేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసే కొద్దిపాటి నిధులు దేనికీ చాలడం లేదు. ఈసారి కేవలం రూ.10వేల చొప్పున కేటాయించింది. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– బిక్కునాయక్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్
చౌటుప్పల్ మండల కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment