ప్రధానోపాధ్యాయులకు అవార్డులు
రాజాపేట : మండలంలోని రఘునాథపురం, పారుపల్లి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి.మాధవరెడ్డికి, ఎం. శశికుమార్‌లు ఉత్తమ టీచర్ ఇన్‌స్ప్రేషన్ – 2024 అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌లోని భాస్కర ఆడిటోరియంలో ఆదివారం శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్ ఉమేష్‌కుమార్ చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
నేడు బీసీ కమిషన్ రాక
నల్లగొండ : రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సోమవారం నల్లగొండ జిల్లాకు వస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల సామాజిక, విద్యాపరమైన స్థితిగతులను, ఆర్థిక ప్రయోజనాలను, వారి వృత్తులు, వృత్తుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై బీసీ కమిషన్ అధ్యయనం చేయనుందని పేర్కొన్నారు. 18న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నల్లగొండ కలెక్టరేట్‌లో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చెందిన బీసీ వర్గాల ప్రజలతో వ్యక్తిగత, నమోదిత, నమోదు కాని అసోసియేషన్ల నుంచి వినతులు, అభిప్రాయాలను స్వీకరించనుందని తెలిపారు. వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న మెటీరియల్, వెరిఫికేషన్, అఫిడవిట్‌తో పాటు ఆరు సెట్లు తెలుగు, ఇంగ్లిష్‌లో బీసీ కమిషన్‌కు అందజేయవచ్చని పేర్కొన్నారు.
డిసెంబర్ 15 నుంచి
సీపీఎం జిల్లా మహాసభలు
మోటకొండూర్ : చౌటుప్పల్ పట్టణంలో డిసెంబర్ 15,16,17 తేదీల్లో సీపీఎం మూడవ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. ఆదివారం చౌటుప్పల్ మండలంలోని ఆరేగూడెంలో మహాసభల కరపత్రాలను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మహాసభల్లో పార్టీ శ్రేణులు, కార్మికులు, రైతులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేషం, జిల్లా కమిటీ సభ్యులు బొలగాని జయరాములు, మండల కార్యదర్శి కొల్లూరి ఆంజనేయులు, గడ్డం వెంకటేష్, కొల్లూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమాల నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
భువనగిరి టౌన్ : దివ్యాంగుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న పాఠశాలలు, ఆశ్రమాలు, సంస్థలు నిర్వహించాలంటే దివ్యాంగుల సంక్షేమ చట్టం–2016 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల కార్యాలయంలో ఈనెల 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేయించకుండా సంస్థలను నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment