క్వింటాళ్ల కొద్దీ దోపిడీ!
ఆలేరురూరల్ : పత్తి రైతులు దగా పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి పండించిన పంటను విక్రయానికి తీసుకురాగా దళారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు కుమ్మకై ్క నిలువునా దోచుకుంటున్నారు. తేమ ఎక్కువగా ఉందని, రంగుమారిందని వేబ్రిడ్జి తూకాల్లో తక్కువ చూపించి మోసగిస్తున్నారు.అధికారులు పర్యవేక్షణ మరవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఇందుకు ఆలేరు పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలే నిదర్శనం. ఆలేరు మండల పరిధిలో రెండు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి ఆలేరు, శారాజీపేటలోని జిన్నింగ్ మిల్లులను అలాట్ చేశారు. ఇక్కడికి పరిసర గ్రామాల రైతులు రోజూ వేల టన్నుల పత్తిని టాటా ఏసీలు, ట్రాక్టర్లు, డీసీఎంలలో తెస్తున్నారు. తొలుత పత్తి లోడ్‌తో ఉన్న వాహనాలను వే బ్రిడ్జిపై తూకం వేస్తున్నారు. అన్‌లోడ్ చేసిన తర్వాత తిరిగి ఖాళీ వాహనాలను వే బ్రిడ్జిపై తూకం వేస్తున్నారు. లోడ్‌తో వేసిన తూకంలో నుంచి వాహనం బరువు తీసేయాల్సి ఉంటుంది. కానీ, వేబ్రిడ్జిపై అదనంగా 20 కిలోల బాటు పెట్టి ఖాళీ వాహనాన్ని తూకం వేస్తున్నారు. ఈ 20 కిలోలను పత్తి నాణ్యతగా లేదని, రంగు మారిందని తరుగు కింద తీస్తున్నారు. ఈ విధంగా ఒక టాటా ఏసీ, ట్రాక్టర్ నుంచి 20 నుంచి 30 కిల్లో కటింగ్ చేస్తున్నారు. డీసీఎం అయితే 50 నుంచి క్వింటా వరకు కోత విధిస్తున్నారు. ఆలేరులోని కాటన్ మిల్లులో సీజన్ ఇప్పటి వరకు 596 మంది రైతుల వద్ద 14088 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.
వేబ్రిడ్జి తూకాల్లో మోసాలు
తరుగు పేరుతో 20నుంచి
50 కిలోల వరకు కోత
నష్టపోతున్న పత్తి రైతులు
పర్యవేక్షణ మరిచిన అధికారులు
మా దృష్టికి రాలేదు
సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు సాఫీగా జరుగుతున్నాయి. తేమ శాతం ఎక్కవ వస్తే అందుకు అనుగుణంగా ధర నిర్ణయిస్తారు. ఎక్కువ తరుగుతీయకుండా చూస్తున్నాం. వే బ్రిడ్జిపైన అదనంగా బాట్లు వేస్తున్నారని మా దృష్టికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీస్తే చర్యలు తీసుకుంటాం.
–అనిల్, కాటన్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్,
ఆలేరు మండలం
50 కిలోలు కోత విధించారు
మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. సుమారు 25 క్వింటాళ్ల దిగుబడి రాగా టాటా ఏసీ వాహనంలో ఆలేరులోని శ్రీమల్లికార్జున కాటన్ మిల్లుకు తెచ్చాను. వే బ్రిడ్జిపై కాంటా వేశారు. పత్తిని అన్‌లోడ్ చేసిన తర్వాత తిరిగి వాహనాన్ని తూకం వేసే సమయంలో వే బ్రిడ్జిపై 20 కిలోల బాట్లు పెట్టారు. మొత్తం 50 కిలోల వరకు కటింగ్ చేశారు.
– ఎం.రమేష్, రైతు, మోటకొండూర్
Comments
Please login to add a commentAdd a comment