డబ్లింగ్ పనులు ప్రారంభం
గుంటూరు – బీబీనగర్ రైల్వే మార్గం
మిర్యాలగూడ : గుంటూరు –బీబీనగర్ మధ్య రెండో రైల్వే (డబ్లింగ్) పనులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు, సరుకు రవాణా సౌకర్యం, రైళ్ల ట్రాఫిక్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఈ లైన్ డబ్లింగ్ పనులకు గతేడాది రూ.2,853 కోట్లు కేటాయించింది. 239 కిలోమీటర్ల మేర లైన్ ఏర్పాటుకు రైల్వేశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. పనులను ప్యాకేజీలుగా విభజించారు. తెలంగాణ పరిధిలో 139కి.మీ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో 100కి.మీ ఉంది. 25 ఏండ్ల క్రితం బీబీనగర్ నుంచి గుంటూరు వరకు సింగిల్ లైన్ ఏర్పాటు చేయగా సరుకు రవాణా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండో లైన్ నిర్మాణం తప్పనిసరి అయ్యింది. రెండో లైన్ పూర్తయితే రైళ్ల సంఖ్య పెరుగుతుంది. సమయం ఆదా అవుతుంది. ఈ మార్గంలో ఉన్న విష్ణుపురం జంక్షన్ కానుండడంతో మోటుమర్రి– జగ్గయ్యపేట, యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు అనుసంధానం చేయనున్నారు.
రెండేళ్లలో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ
డబ్లింగ్ పనుల్లో భాగంగా ట్రాక్ వెంట కంపచెట్లను తొలగించారు. వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించేందుకు వీలుగా మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. రెండు వరుసలకు గతంలోనే భూసేకరణ జరగగా తాజాగా నిర్వహించిన సర్వేలో మరికొంత భూమి అవసరం ఉన్నట్లుగా గుర్తించారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో భూమి కోసం రెవెన్యూ అధికారులు ప్రకటన జారీ చేశారు. మాడ్గులపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో 14 ఎకరాల భూమిని సేకరించనున్నారు. రానున్న రెండేండ్లలో పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో మిర్యాలగూడ, నల్లగొండ, చిట్యాల, రామన్నపేట, బీబీనగర్ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు ప్రయాణికులకు రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
ఫ గతేడాది రూ.2,853 కోట్లు కేటాయించిన కేంద్రం
ఫ 239 కి.మీ పరిధిలో పలు ప్యాకేజీలుగా పనుల విభజన
ఫ ట్రాక్ వెంట మట్టి నమూనాల సేకరణ
Comments
Please login to add a commentAdd a comment