బీసీలకు అన్యాయం జరగదు
నల్లగొండ : బీసీలకు అన్యాయం జరగకుండా చూడడం తమ బాధ్యత అని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులపై కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు చెందిన బీసీ నాయకులు, కుల సంఘాల సభ్యుల నుంచి వినతిపత్రాలు స్వీకరించడంతో పాటు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మూడు జిల్లాల కలెక్టర్లతో పాటు పోలీస్ అధికారులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రస్తుతం చేపట్టిన సర్వే ద్వారా వారి పరిస్థితి తెలుసుకుని న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. బీసీలు సమాజ సంపదలో వాటా కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీసీ స్థితిగతులు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపడుతోందన్నారు. బీసీల్లోని చాలా కులాలు ఇంకా వివక్షకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ బీసీ కమిషన్ బహిరంగ విచారణకు ప్రత్యేకించి అఫిడవిట్ ఏర్పాటు చేయడంతోపాటు జిరాక్స్, ఇతర సౌకర్యాలను కల్పించామన్నారు. సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి మాట్లాడారు. భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, సూర్యాపేట కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలు ఇలా..
● బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ సమగ్ర కులగణన పక్కాగా జరగాలని కోరారు. స్థానిక సంస్థల్లో ఏబీసీడీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నారని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సమీక్షించాలని సూచించారు.
● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలని కోరారు.
● విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు విశ్వనాథం మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ, వడ్రంగి తదితర కులాలన్నింటినీ ఒకే కులం కింద చూపాలని కోరారు.
● గంగపుత్ర సంఘం నాయకుడు మునాస ప్రసన్న మాట్లాడుతూ గంగపుత్ర, బేస్త, చేపలు పట్టే కులస్తులందరనీ ఒకే సామాజిక వర్గంగా గుర్తించాలని కోరారు.
● బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం, బీసీ కార్పొరేషన్లు ఏకం కావడం వల్ల అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలోని కొన్ని కులాలకే పెన్షన్ ఇస్తున్నారని మిగతా కులాలకు కూడా ఇవ్వాలని కోరారు.
● రజక సంఘం నాయకుడు కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు ఏబీసీడీ పద్ధతిన ప్రాతినిధ్యం కల్పిస్తేనే న్యాయం జరుగుతుందనన్నారు.
వెనుకబడిన వారిని గుర్తించి ఆదుకునేందుకే సర్వే
ఫ బీసీలు సమాజ సంపదలో వాటా కోసం పోరాడాలి
ఫ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
ఫ బీసీల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులపై నల్లగొండలో బహిరంగ విచారణ
నాయీ బ్రాహ్మణులను ఉద్యోగులుగా గుర్తించాలి
నాయీ బ్రాహ్మణ సంఘం నాయకుడు నేలపట్ల రమేష్ మాట్లాడుతూ దేవాలయాల్లో తల నీలాలు తీసే నాయీ బ్రాహ్మణులను ఉద్యోగులుగా గుర్తించడం లేదన్నారు. క్షౌరాలు చేసే సమయంలో అంటు వ్యాధులు వచ్చి చనిపోతున్నారని.. చనిపోతే దేవాలయం తరఫున దండ వేసే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి రాత పూర్వకంగా తీసుకుపోయి ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు గౌరవం దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment