సమగ్ర సర్వేపై అదనపు కలెక్టర్ సమీక్ష
భువనగిరి రూరల్: భువనగిరి మండల పరిషత్ కార్యాలయాన్ని సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేపై సమీక్షించారు. సర్వేకు సంబంధించిన డాటా ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ దినకర్, ఎంపీఎస్‌ఓ, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగవంతం చేస్తాం : ఆర్డీఓ కృష్ణారెడ్డి
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ పనుల కోసం భూ సేకరణకు ప్రాధాన్యమిచ్చి ఆ ప్రక్రియను వేగవంతం చేస్తానని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం ఆయన భువనగిరిలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం ఇటీవల యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంగా వైటీడీఏ కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. గౌరెల్లి–కొత్తగూడెం జాతీయ రహదారిపై మో త్కూరు, అడ్డగూడూరు మండలాల్లో భూసేకరణ చేస్తామన్నారు. అలాగే నృసింహసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. రూ.50 కోట్ల పరిహారం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిందన్నారు. అయితే ఇంకా రూ.59 కోట్లు మంజూరు కానున్నాయన్నారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్డులో భువనగిరి పరిధిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. పరిహారం ధర నిర్ణయం చేయాల్సి ఉందని ఆర్డీఓ చెప్పారు.
శివకేశవులకు
విశేష అభిషేకాలు
యాదగిరిగుట్ట: శివ కేశవులకు నెలవైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు విశేషంగా నిర్వహించారు. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను సంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకోగా, పూజారులు శ్రీస్వామి వారి ఆశీస్సులను అందజేశారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలు, నిత్యకల్యాణ వేడుక, శ్రీసుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు కొనసాగాయి.
వే బ్రిడ్జి నిర్వాహకులకు నోటీసులు
ఆలేరు రూరల్: ఆలేరు పట్టణంలోని శ్రీమల్లిఖార్జున కాటన్ జిన్నింగ్ మిల్లు నిర్వాహకులకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. తూనికలు, కొలుతల విషయంలో అవకతవకలపై క్వింటాళ్ల కొద్ది దోపిడీ అనే శీర్షికన సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కందిగట్ల వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి ఆలేరులోని మల్లిఖార్జున కాటన్ మిల్లును తనిఖీ చేశారు. వెంటనే సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అనంతరం మండలంలోని శారాజీపేటలో శ్రీనిధి కాటన్ మిల్లులోని వేబ్రిడ్జిని తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment