చెత్త నిల్వకు ‘బయోసాయిల్’ ఆటంకం
● భువనగిరి డంపింగ్ యార్డులో
పేరుకుపోయిన నిల్వలు
● రెండేళ్లుగా తరలించిన
బయోసాయిల్ 4 వేల మెట్రిక్ టన్నులే..
● ప్రస్తుతం నిల్వ ఉన్నది సుమారు
పది వేల మెట్రిక్ టన్నులు
● ఏడాది కాలంగా పట్టించుకోని
ప్లాంట్ నిర్వాహకులు
భువనగిరి: భువనగిరి మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్లాంట్ ద్వారా శుద్ధిచేసిన జీవం ఉన్న మట్టి (బయోసాయిల్) గుట్టలుగా పేరుకుపోతోంది. దీంతో ఇంటింటా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో నిల్వ చేసేందుకు స్థలం సరిపోవడం లేదు. ఇటీవల ఉన్నతాధికారులు డంపింగ్ యార్డును సందర్శించిన సందర్భంగా బయో సాయిల్‌ను తరలించకుండా చెత్తను ఎలా నిల్వ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల వరకు బయోసాయిల్ నిల్వ ఉన్నట్టు అధికారుల అంచనా.
2020లో బయోమైనింగ్ ప్లాంట్ ఏర్పాటు
వ్యర్థాలు మానవాళికి ప్రాణాంతకరంగా పరిణమిస్తున్నాయని గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కేంద్రప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్తను శుద్ధి(బయో సాయిల్) చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ శివారులోని తుక్కాపురం గ్రామానికి వెళ్లే రోడ్డులో 5.20 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసింది. ఇందులోనే 2.50 ఎకరాల స్థంలో పార్కును ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలంలో 2020 అక్టోబర్ 2న బయోమైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయగా దాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వ్యర్థాలు శుద్ధి చేసే కాంట్రాక్టును మహారాష్ట్రలోని సాగర్ మోటార్స్ సంస్థకు అప్పగించారు.
సంవత్సర కాలంగా..
భువనగిరి డంపింగ్ యార్డులోని బయోమైనింగ్ ప్లాంట్ ఆరు నెలల పాటు పనిచేసింది. ఇదే సమయంలో కరోనా విజృంభించడంతో ఇక్కడ పనిచేస్తున్న వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. తిరిగి ఈ ప్లాంట్‌లో 2022 డిసెంబర్‌లో పనులు ప్రారంభించారు. బయో సాయిల్ చేసిన సంస్థకు సీడీఎంఏ ద్వారా నిధులు ఇస్తోంది. ఇక్కడి బయో సాయిల్‌ను గ్రామాల్లో గుంతలు, పాడుబడిన బావులను పూడ్చేందుకు ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 4 మెట్రిక్ టన్నుల మట్టిని మాత్రమే తరలించారు. ఏడాది కాలంగా ఎవరూ మట్టిని తీసుకుపోవడానికి ముందుకు రాకపోవడంతో ప్లాంట్‌లో ఽఇంకా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల వరకు మట్టి పోరుకుపోయి ఉంది.
రోజూ 22 మెట్రిక్ టన్ను చెత్త సేకరణ
భువనగిరి పట్టణంలో 35 వార్డులున్నాయి. ఆయా వార్డుల్లో సుమారు 15 వేలకుపైగా గృహాలు ఉండగా సుమారు 70వేలకు పైగా జనాభా ఉంది. నిత్యం తడి, పొడి చెత్త సేకరణకు మున్సిపాలిటీలో 18 ఆటోలు, 4 ట్రాక్టర్లు ఉన్నాయి. నిత్యం 52 మంది పారిఽశుద్ధ్య కార్మికులు ఉన్నారు. దీంతో రోజూ 22 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. ప్రస్తుతం ఈ యార్డులో బయోసాయిల్ పేరుకుపోవడంతో చెత్త నిల్వ చేసేందుకు స్థలం సరిపోక సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.
నోటీసులు జారీ చేశాం
బయోమైనింగ్ ప్లాంట్‌లో మట్టి దిబ్బలు ఉండటం వల్ల చెత్త నిల్వకు ఇబ్బందిగా ఉంది. మట్టిని తరలించాలని బయోమైనింగ్ ప్లాంట్ నిర్వాహకులకు పలుమార్లు చెప్పినా వినకపోవడంతో బిల్లులు నిలిపివేయాలని అధికారులకు నోటీసులు జారీ చేశాం.
– రామాంజులరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భువనగిరి
●
Comments
Please login to add a commentAdd a comment