రైతులు దళారులను ఆశ్రయించొద్దు
భువనగిరిరూరల్: రైతులు దళారులను ఆశ్రయించొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీల్లేదన్నారు., రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. రైతుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం వివరాల రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్, అధికారులు ఉన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
కొనుగోళ్లు త్వరితగతిన పూర్తిచేయాలి
వలిగొండ: ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించారు. మంగళవారం వలిగొండ మండలం సంగెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా సంగెంలోని ధాన్యలక్ష్మి ఫారాబాయిల్డ్ అండ్ రైస్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. మిల్లు యజమానితో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి లారీలలో వచ్చిన ధాన్యాన్ని సమయానుకూలంగా దిగుమతులు చేసుకోవాలని, నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌ఐ కరుణాకర్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment