అమృత్.. ఆలస్యం!
సాక్షి, యాదాద్రి: ప్రజలకు మంచినీటి ఎద్దడి తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆయా పనులకు రూ.121.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. కానీ ఆయా మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభించినా ఎక్కడా పూర్తయిన దాఖలాలు లేవు. చాలాచోట్ల సాంకేతిక సమస్యలు, కూలీల కొరత, రాజకీయ వివాదాల కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. ఐదు నెలల్లోగా పనులు పూర్తిచేయాల్సి ఉన్నా ఇంకా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. దీంతో అమృత్ పథకం లక్ష్యం ఇప్పట్లో నెరవేరేలా లేదు.
మున్సిపాలిటీల వారీగా పనులు ఇలా..
● భువనగిరి మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకం కింద రూ.21.8 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్‌లో రూ.15 లక్షల కిలోలీటర్ల ట్యాంకు, సింగన్నగూడెంలో 10 లక్షల లీటర్ల ట్యాంక్, రాయిగిరిలో 3లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మించాల్సి ఉంది. ప్రగతినగర్‌లో నిర్మిస్తున్న ట్యాంకు పనులు సాగుతుండగా, సింగన్నగూడెం రాయిగిరిలో ప్రతిపాదించిన ట్యాంకులకు డిజైన్లు రాకపోవడంతో ఇంకా ప్రారంభించలేదు.
● యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి రూ.38 కోట్లు మంజూరయ్యాయి. పైపులైన్ పనులతోపాటు గణేష్‌నగర్‌లో 1,200 కే.ఎల్, అంగడి బజారు దగ్గర 500 కేఎల్, గుండ్లపల్లిలోని నల్లాలబావి వద్ద 500 కిలోలీటర్ల ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభించారు. గణేష్ నగర్‌లో స్థలం చూసినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
● ఆలేరు మున్సిపాలిటీకి రూ.12 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఆలేరు మున్సిపాలిటీని రెండు జోన్లుగా విభజించారు. జోన్–1 రైల్వే ట్రాక్ ఉత్తర దిశలో నూతనంగా 7 లక్షల లీటర్లు, జోన్–2 రైల్వే దక్షిణ దిశలో నూతనంగా పది లక్షల లీటర్ల సామర్థ్యంతో ఈఎల్‌ఎస్‌ఆర్ ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి రూ.2.97 కోట్లు కేటాయించారు. సాంకేతిక సమస్యలతో పనులు నిలిచిపోయాయి. డిజైన్ మార్చాలని నిర్ణయించడంతో ఆలస్యం అవుతోంది. పైపులైన్ నిర్మాణ పనులకు రూ.1.63 కోట్లు, మరో ఏడు రకాల పనులకు రూ.3.75 కోట్లు కేటాయించారు.
● భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలో వెంకటరమణ కాలనీ ఏడో వార్డులో రూ.17.50 కోట్ల వ్యయంతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, పైపులైన్ పనులు ప్రతిపాదించారు. సెప్టెంబర్‌లో పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి.
పనులు కొనసాగుతున్నాయి
అమృత్ పథకం కింద జిల్లాలో వాటర్ ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సాంకేతిక సమస్యలతో ఒకటి రెండు చోట్ల పనులు నిలిచిపోయాయి. వాటిని కూడా త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తాం. ప్రారంభించిన పనులు ఎక్కడైనా నిలిచిపోతే వాటిని గుర్తించి వెంటనే పూర్తి చేయిస్తాం.
– మనోహర, డీఈ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్
ఫ నత్తనడకన సాగుతున్న
అమృత్ పథకం పనులు
ఫ ఎక్కడా పూర్తికాని ట్యాంక్ నిర్మాణలు
ఫ సాంకేతిక సమస్యలు,
కూలీల కొరత కారణంగా ఆలస్యం
మోత్కూర్ మున్సిపాలిటీకి రూ.12 కోట్లు మంజూరయ్యాయి. 800 కేఎల్ సామర్థ్యంతో జూనియర్ కాలేజీలో నిర్మించతలపెట్టిన ట్యాంకు పనులు శంకుస్థాపన అనంతరం పునాదులకే పరిమితమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 600 కేఎల్ సామర్థ్యంతో చేపట్టిన వాటర్ ట్యాంక్ పిల్లర్ల దశలో నిలిచిపోయింది. 12 కిలోమీటర్ల దూరం పైపులైన్ వేయాల్సి ఉంది.
చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. చౌటుప్పల్, తాళ్లసింగారం, లక్కారం గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణాలకు ప్రతిపాదించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో, తంగడపల్లిలో నిర్మించే ట్యాంకులు ఒక్కొక్కటి 7.50 లక్షల కెపాసిటీ ఉండగా, మిగతావి 5 లక్షల కెపాసిటీ ఉన్నాయి. నెల రోజుల క్రితమే పనులు ప్రారంభంకాగా నత్తనడకన సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment