టార్గెట్.. స్టేట్ ఫస్ట్!
అగ్రస్థానంలో నిలుపుతాం
పదో తరగతి పరీక్ష ఫలి తాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇందు కోసం ఇప్పటికే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులను ఏ,బీ,సీలుగా విభజించాం. సీ విభాగంలోకి వచ్చే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయులు తెల్లవారుజామున విద్యార్థులకు ఫోన్ చేసి చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకు కోసం పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాం. తరచూ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తున్నాం.
– కె.సత్యనారాయణ, డీఈఓ
నూరుశాతం ఉత్తీర్ణతకు ప్రయత్నం
పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. చదువులో వెనుబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. గత ఫలితాలకు ధీటుగా మెరుగైన జీపీఏ పాయింట్లు సాధించడం కోసం ప్రయత్నిస్తున్నాం.
– టి.సురేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, వెల్లంకి, రామన్నపేట మండలం
‘పది’ ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా..
భువనగిరి, రామన్నపేట : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గత రెండేళ్లుగా యాదాద్రి జిల్లా రాష్ట్రస్థాయిలో వెనుకబడుతోంది. ప్రత్యేక తరగతులు నిర్వహించినా, నిపుణులతో తయారు చేయించిన మెటీరియల్ ఇచ్చినా, ఉదయం స్టడీ అవర్స్‌లో అల్పహారం సైతం అందజేసినా.. ఫలితాలకు వచ్చే సరికి డీలా పడుతోంది. ఇందుకు ఉపాధ్యాయుల కొరత, పర్యవేక్షణకు ఎంఈఓలు లేకపోవడం కారణమన్న విమర్శలున్నాయి. ఈసారి రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
కార్యాచరణ ఇదీ..
● సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
● ప్రతి రోజూ వేకువజామున 5గంటలకు విద్యార్థులను ఉపాధ్యాయులు ఫోన్ ద్వారా నిద్రలేపి చదివిస్తున్నారు.
● ప్రతి రోజూ ఒక సబ్జెక్ట్ కేటాయిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. సబ్జెక్ట్ టీచర్ తప్పకుండా ఉండి ప్రత్యేక తరగతిలో బోధన చేస్తున్నారు.
● ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు మానిట రింగ్ చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేస్తున్నారు.
● తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల ప్రగతిని తెలియజేస్తున్నారు. ఇంటివద్ద పిల్లలు చదువుకోవడానికి ఏవిధమైన చర్యలు తీసుకోవాలో తల్లిదండ్రులకు సూచనలు చేస్తున్నారు.
● గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి నిపుణులతో తయారు చేయించిన అభ్యాసన దీపికలను విద్యార్థులకు పంపిణీ చేశారు.
● డిసెంబర్ 31వ తేదీ వరకు అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను పూర్తిచేయాలి. ప్రతీ యూనిట్ (పాఠం) పూర్తయిన వెంటనే స్లిప్‌టెస్ట్ నిర్వహించాలి.
● జనవరి 2025 నుంచి వార్షిక పరీక్షలు జరిగే వరకు ప్రతి రోజూ పునఃశ్చరణ(రిమీడియల్) తరగతులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
● ఎస్‌ఏ–1 ఫలితాల ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించాలి. ఏ, బీ గ్రూపుల్లోని విద్యార్థులు మంచి గ్రేడు సాధించే విధంగా తీర్చిదిద్దాలి. సీ గ్రూపు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు మంచి ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలి.
కలిసొచ్చే అంశాలు..
నెల రోజుల క్రితం ప్రభుత్వం ప్రతి మండలానికి ఇంచార్జి ఎంఈఓలను నియమించింది. అలాగే డీఎస్సీ–2024 ద్వారా 252 మంది కొత్త ఉపాధ్యాయులు నియామకం అయ్యారు. ప్రతి ఉన్నత పాఠశాలకు గెజిటేడ్ ప్రధానోపాధ్యాయులు వచ్చారు. దీంతో సబ్జెక్టులు బోధించడానికి టీచర్ల కొరత కొంతమేకు తీరింది.
మూడేళ్లుగా ఫలితాలు
సంవత్సరం ఉత్తీర్ణత శాతం రాష్ట్ర స్థాయిలో స్థానం
2021 - 22 94.15 13
2022 - 23 80.97 23
2023 - 24 99.94 25
ప్రణాళిక రూపొందించిన విద్యాశాఖ
ఏబీసీ గ్రూపులుగా విద్యార్థుల విభజన
సీ విభాగం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
అభ్యసన దీపికల పంపిణీ
హెచ్‌ఎంల నిరంతర మానిటరింగ్
రెండేళ్లుగా జిల్లా స్థానం ఇదీ..
2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు 9,400 మంది విద్యార్థులు హాజరు కాగా 8,799 మంది ఉత్తీర్ణులయ్యారు. 80 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 2022–23 విద్యా సంవత్సరంలో 8,973 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 7,265 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 23వ స్థానంలో నిలిచింది. 2023–24 విద్యా సంవత్సరంలో 9,108 మంది విద్యార్థులకు గాను 8,237 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో జిల్లా 25వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరానికి గాను మార్చిలో జరగనున్న పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 9,290 మంది హాజరుకానున్నారు. గత అనుభవాలు, ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ విద్యాసంవత్సరం నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకెళ్తోంది. మెరుగైన ఫలితాల సాధనతో రాష్ట్రస్థాయి ర్యాంకును మెరుగుపరచుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment