సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు విక్రయించడానికి రైతులు అసక్తి చూపడంలేదు. క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నా, ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ముందుకు రావడం లేదు. జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు సేకరించాలని అధికారులు లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటి వరకు 2 వేల మెట్రిక్ టన్నులకు మించలేదు. ప్రభుత్వానికి విక్రయించకుండా బియ్యం పట్టించి కొంత సొంత అవసరాలకు నిల్వచేసుకుంటున్నారు. మిగతా బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధరకు విక్రయిస్తున్నారు.
సన్నాల సాగు, సేకరణ లక్ష్యం
వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2.85 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో సన్నరకం 35 వేల ఎకరాల్లో సాగు చేయగా.. 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంట్లో 30వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 47 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈసారి సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించింది. అయినా సన్నవడ్లను కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ఇప్పటి వరకు 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కేంద్రాలకు రాలేదు.
బియ్యానికి పెరిగిన డిమాండ్
సన్నాలు సాగు చేసిన రైతులు బియ్యం పట్టించిన రైతులు కొంత తమ అవసరాలకు నిలువ చేసుకుని మిగతాది బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న పరిచయస్తులకు రవాణా చార్జీలు తీసుకుని చేరవేస్తున్నారు. మరోవైపు బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో వినియోగదారులు ఏడాదికి సరిపడా ఒకేసారి కొనుగోలు చేస్తున్నారు. దీంతో సన్న బియ్యానికి డిమాండ్ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment