అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
సాక్షి,యాదాద్రి: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రాధాన్యమని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, పెంచిన 40 శాతం మెస్‌చార్జీల ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
పనుల ప్రగతిని
ముందుకు తీసుకెళ్తాం
ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనుంది. ఇప్పటికే ఇందిరమ్మ లబ్ధిదారుల సర్వే 91 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తాం. జిల్లాలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, పలు ఇంజనీరింగ్ విభాగాల్లో మంజూరైన నిధులతో పనుల ప్రగతిని ముందుకు తీసుకెళ్తాం.
ఆయిల్‌పామ్
సాగుకు ప్రోత్సాహం
రైతులకు లాభసాటిగా ఉండే ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తాం. రైతులు ఒక్కసారి ఆయిల్ పామ్ సాగు చేస్తే 30 ఏళ్లు ఆదాయం వస్తుంది. ఈ సాగు కోసం రైతులకు రాయితీలు ఇస్తున్నాం.
ప్రతిరోజు వైద్యులతో జూమ్ మీటింగ్
నార్మల్ డెలివరీల సంఖ్య పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తాం. సిజేరియన్‌ల సంఖ్య తగ్గించే ప్రత్యేక కార్యాచరణ చేపడుతాం. ప్రస్తుతం ప్రతిరోజు ఉదయం 8.55 గంటలకు వైద్యులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. దీంతో సకాలంలో వైద్యుల హాజరు పెరిగింది. అదేవిధంగా అస్పత్రికి వచ్చే ఓపీ రోగులకు అందించే సేవలను గుర్తించగలుగుతున్నాం. రోగులతో నేరుగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తున్నాం.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ
హాస్టళ్లను విరివిగా తనిఖీ చేస్తున్నాం. హాస్టళ్లలో రాత్రి నిద్ర చేస్తున్నాం. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకాధికారులను నియమించి నిరంతర నిఘా కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం ఇటీవల 40 శాతం మెస్ చార్జీలు పెంచింది. పెంచిన చార్జీల ప్రకారం మెనూ అమలయ్యేలా ప్రత్యేక చర్యలు చేపడుతాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. అదేవిధంగా జిల్లాలో పాల దిగుబడి మరింత పెంచే విధంగా పాడి పశువుల కొనుగోలుకు మహిళలకు రుణాలు ఇస్తాం.
ఫ విద్య, వైద్యం మెరుగునకు కృషి
ఫ అర్హులకు పథకాలు అందిస్తాం
ఫ ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో
రాష్ట్రంలోనే జిల్లా నంబర్ వన్
నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్
హనుమంతరావుతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ
Comments
Please login to add a commentAdd a comment