అపార్ నమోదు 10 శాతమే!
భువనగిరి : రెండో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి గుర్తింపుకార్డు జారీకోసం చేపట్టిన ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)కి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనెల 31వరకు వివరాల నమోదు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటి పరకు కేవలం 10 శాతం మాత్రమే పూర్తయ్యింది. విద్యార్థి పుట్టిన తేదీ, పేరు, తల్లిదండ్రుల పేర్లలో తప్పులు ఉండడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు సహకరించినచోట కొంతవరకు నమోదు ప్రక్రియ ముందుకు సాగుతుండగా, మిగిలిన చోట్ల ఉపాధ్యాయులు కుస్తీ పట్టాల్సి వస్తోంది.
కార్డులో విద్యార్థుల సమగ్ర సమాచారం
వన్ నేషన్ వన్ స్టూడెంట్ నినాదంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అపార్ నమోదు చేపట్టారు. ఈ ప్రక్రియను గత ఏడాది సెప్టెంబరు నెలాఖరు నుంచి ప్రారంభించారు. వివరాల నమోదుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉంది. ఇది పూర్తయితే ప్రతి విద్యార్థికి 12 అంకెలతో గుర్తింపు నంబర్ రానుంది. ఇది విద్యార్థుల భవిష్యత్‌కు ప్రామాణికం కానుంది. ఉన్నత చదువులు, ఇంటర్వ్యూలు తదితర వాటికి 12 అంకెల నంబర్ ఉపయోగించి దరఖాస్తు చేసుకునేలా రూపొందించారు.
11,851 మంది విద్యార్థుల వివరాలు నమోదు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు 1,231 వరకు ఉన్నాయి. వీటిలో 1,14,548 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు 11,851 మంది విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. ఆపార్ నమోదు ప్రారంభించని పాఠశాలలు, కళాశాలలు కూడా ఉండటం గమనార్హం. ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు అపార్‌ను పట్టించుకోవడం లేదు.
ప్రధాన సమస్యలు ఇవీ..
● అపార్ నమోదుకు విద్యార్థుల ఆధార్ వివరాలతో పాటు తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. యూడైసీలో ఇప్పటికే ఉన్న విద్యార్థులు పర్మనెంట్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ వివరాలకు సరిపోకపోవడంతో అసలు సమస్య ఏర్పడుతుంది. చాలా మంది విద్యార్థుల వ్యక్తిగత వివరాలకు, ఆధార్‌లోని సమాచారానికి సరిపోలడం లేదు. దీంతో ఆధార్‌లో పేరు మార్పులు, అక్షరాల్లో తప్పులను సరి చేయాల్సి ఉంది. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలను జతచేయడం తప్పనిసరిగా మారింది. ఈ విషయంలో టెన్త్ మార్కుల మెమో, బోనోఫైడ్‌తో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలి. కాని ఈ ప్రక్రయ సకాలంలో జరగక నమోదు జాప్యం జరుగుతుంది.
● తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబందించిన వివరాలు, అంగీకార పత్రాలు ఉపాధ్యాయులకు సకాలంలో అందించడం లేదు.
● ఉపాధ్యాయులకు అవగాహన లేకపోవడంతో నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంటర్ కళాశాలల్లో వార్షిక పరీక్షల పైనే దృష్టి పెట్టడంతో నమోదు కావడం లేదు.
● ఎమ్మార్సీల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు చాలా రోజులు సమ్మెలో ఉండటం, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్లు లేకపోవడం నమోదు అలస్యానికి కారణంగా చెప్పవచ్చు.
ఫ విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లలో తప్పులు
ఫ మందకొడిగా కొనసాగుతున్న అపార్ ప్రక్రియ
ఫ ఈనెల 31 వరకు తుది గడువు
ఫ వార్షిక పరీక్షలపైనే దృష్టి సారించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు
ఫ గడువులోపు పూర్తయ్యేనా?
పాఠశాలలు,
కాలేజీలు
231
విద్యార్థులు
1,14,548
నమోదు
11,851
గడువులోపు పూర్తి చేస్తాం
ప్రతి విద్యార్థికి అపార్ నమోదు చేయాల్సిందే. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సాంకేతి లోపాలున్నాయి. వాటిని అధిగమించి నమోదు పూర్తి చేయిస్తాం. పండుగ సెలవులు రావడం, సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేయడం వల్ల ప్రక్రియ నెమ్మదించింది. నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తాం.
– సత్యనారాయణ, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment