డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

Published Tue, Jan 21 2025 2:00 AM | Last Updated on Tue, Jan 21 2025 2:00 AM

డైరీ,

డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

భువనగిరిటౌన్‌ : తెలంగాణ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా డైరీ, క్యాలెండర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, అడిషనల్‌ కలెక్టర్‌ గంగాధర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మందడి ఉపేందర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నాగిరెడ్డి జగన్మోహన్‌ ప్రసాద్‌, ధరణికోట భగత్‌, మహమ్మద్‌ కదీర్‌, కె.శ్రీకాంత్‌, పెండెం శ్రీనివాస్‌, శశికాంత్‌ గౌడ్‌, శైలజ ఆనంద్‌, కటకం సిద్ధేశ్వర్‌, ఆసిఫ్‌, మోహన్‌ కుమార్‌, శ్రావణ్‌ కుమార్‌, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రామగిరి(నల్లగొండ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైనట్లు యాదాద్రి జోన్‌ అధికారి సంధ్యారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతిలో మిగిలిపోయిన సీట్లకు, గౌలిదొడ్డి ఎస్సీ సీఓఈ గురుకులంలో 9వ తరగతి, పరిగి ఎస్‌ఓఈలో 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రుక్మాపూర్‌లోని ఎస్సీ గురుకుల సైనిక్‌ స్కూల్‌, మల్కాజ్‌గిరి ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాలు ఉన్నట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి 23వ తేదీలోపు www. tgcet.cgg.gov.inలో ఆన్‌లైన్‌ ద్వారా రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సిబ్బంది సమయపాలన

పాటించాలి

భువనగిరిటౌన్‌ : అంగన్‌వాడీ సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు సూచించారు. సోమవారం భువనగిరి అర్బన్‌ పరిధిలోని ఆదర్శనగర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించిన గుడ్లు, బియ్యం, బాలామృతం, పాలు నాణ్యత, స్టాకు రిజిస్టర్‌, హాజరు రిజిస్టర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలింతలకు, గర్భిణులకు, కిశోర బాలికలకు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలన్నారు. సరుకులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ టీ.విజయగౌరీ, ఆయా భాగ్యమ్మ ఉన్నారు.

శివ కేశవులకు

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: శివ కేశవులకు నిలయమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చనలు, మండపంలో స్పటిక లింగానికి పూజలు విశేషంగా నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకోగా, పూజారులు స్వామి వారి ఆశీస్సులు అందజేశారు. ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలను కొనసాగించారు. ఆలయంలో నిత్య కల్యాణ వేడుక, శ్రీసుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు వంటి పూజలను ఆచార్యులు వైభవంగా జరిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ1
1/1

డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement